ఏదైనా బ్యానర్‌లో హీరోలు రిపీట్ అవుతారు, దర్శకులు రిపీట్ అవుతారు.. అయితే హీరోయిన్లు రిపీట్ అవ్వడం చాలా తక్కువ. ఏదో పెద్ద బ్యానర్లలో కొత్త హీరోయిన్లు రిపీట్ అవుతుంటారు కానీ.. స్టార్ హీరోయిన్ హోదా అందుకున్న హీరోయిన్లు మాత్రం రిపీట్ అవ్వరు. అయితే మీనాక్షి చౌదరి విషయంలో ఇప్పుడు జరుగుతోంది. ఆ బ్యానర్‌లో మూడు సినిమాలు చేసిన మీనాక్షి.. ఇప్పుడు నాలుగో సినిమాకు సర్వం సిద్ధమవుతోంది అని చెబుతున్నారు. ఆ బ్యానరే నాగవంశీకి చెందిన సితార ఎంటర్‌టైన్మెంట్స్.
సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో మీనాక్షి చౌదరి రెండు సినిమాలు చేశారు. అవే ‘లక్కీ భాస్కర్’, ‘అనగనగా ఒక రాజు’. ఇక నాగవంశీ మొదటి/ ప్రధాన బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్‌లో ఓ సినిమా (గుంటూరు కారం) చేసింది. అలా మూడు సినిమాలు చేసిన మీనాక్షి.. ఇప్పుడు నాలుగో సినిమాకు ఓకే చెప్పింది అని అంటున్నారు. సితార బ్యానర్‌లో సిద్ధు జొన్నలగడ్డ, కార్తి, నాని సినిమాలు ఉన్నాయి. అందులో నాని సినిమాకు హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ ఓకే అయింది.
ఆ లెక్కన సిద్ధు, కార్తి సినిమాల్లో ఒక దాంట్లో మీనాక్షి నటించే అవకాశం ఉంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే మీనాక్షి చౌదరి మరో తమిళ సినిమా, ఇంకో బాలీవుడ్ సినిమా ఓకే చేసింది. ఇవి కాకుండా మరో బాలీవుడ్ సినిమా చర్చల్లో ఉందని సమాచారం. ఆ లెక్కన మీనాక్షి ఇప్పుడు బిజీ బిజీగా ఉంది. ఇక నాగచైతన్య సినిమా ‘వృష కర్మ’లోనూ మీనాక్షి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలవుతోంది.
2024లో ఆరు (గుంటూరు కారం, సింగపూర్‌సెలూన్, గోట్, లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ ) సినిమాలతో బాక్సాఫీసు ముందుకు వచ్చిన మీనాక్షి.. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే ఒక్క సినిమానే చేసింది.