Minnal Murali Review: మిన్నల్ మురళి సినిమా రివ్యూ & రేటింగ్!

  • December 24, 2021 / 06:45 PM IST

ఎప్పుడూ మార్వెల్, డీసీ సినిమాలు చూసి మన ఇండియాకి సూపర్ హీరో ఉండి, అతనిపై కూడా సినిమా వస్తే ఎంత బాగుండు అని ప్రతి ఒక్క ఇండియన్ అనుకునే ఉంటాడు. అలా అనుకున్నవాళ్లందరికీ దొరికిన సమాధానమే “మిన్నల్ మురళి”. మలయాళ ఇండస్ట్రీ రూపొందించిన ఈ ఇండియన్ సూపర్ హీరో ఫిలిమ్ టైటిల్ దగ్గర నుంచి ట్రైలర్ వరకూ అన్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో విడుదలవ్వడానికి ప్రయత్నించినప్పటికీ.. కేరళలో కరోనా కారణంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. మరి ఈ సూపర్ హీరో సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

కథ: ఉరవకొండ అనే ఓ చిన్న గ్రామంలో నివసించే జేసన్ (టోవినో థామస్), ఓ టైలర్ షాప్ నడుపుతూ ఎప్పటికైనా అమెరికా వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉంటాడు. అదే ఊర్లో చిన్న కాకా హోటల్లో పని చేసే షిబు (గురు సోమసుందరం). ఈ ఇద్దరికీ మెరుపు దాడి వల్ల కొన్ని ఊహించని శక్తులు వస్తాయి. ఆ శక్తులను ఎవరెలా వినియోగించుకున్నారు? ఈ ఇద్దరి శక్తుల కారణంగా ఉరవకొండ ఎలాంటి ఇబ్బందులు పడింది? ఎవరు హీరో? ఎవరు విలన్? అందుకు ప్రేరేపించిన కారణాలు ఏమిటి? అనేది “మిన్నల్ మురళి” కథాంశం.

నటీనటుల పనితీరు: ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో టోవినో థామస్ శైలి ప్రత్యేకం. హీరోగా ఒక 30 సినిమాలు చేస్తే.. అందులో 20కి పైగా ప్రయోగాలే. మిన్నల్ మురళి అన్నిటికంటే పెద్ద ప్రయోగం. ఈ ప్రయోగానికి తన 100% అందించాడు టోవినో. అతడి క్యారెక్టర్ ఆర్క్, పెర్ఫార్మెన్స్ అండ్ క్యారెక్టర్ ను ఓన్ చేసుకున్న విధానం అభినందనీయం.

నెగిటివ్ క్యారెక్టర్ లో గురు సోమసుందరం అదరగొట్టాడు. మిగతా సపోర్టింగ్ రోల్స్ ను బాగా రాసుకున్నాడు దర్శకుడు, సదరు పాత్రధారులు కూడా అదే విధంగా పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు బాసిల్ జోసెఫ్ రాసుకున్న కథ కొత్తదేమీ కాదు. ఇంకా చెప్పాలంటే.. హాలీవుడ్ ఫిలిమ్ “గ్రీన్ లాంతర్న్”కు కాపీలా ఉంటుంది. రెండిటి కథాంశం మాత్రమే కాదు క్యారెక్టరైజేషన్స్ కూడా సేమ్. కాకపోతే.. సదరు పాత్రలను లోకలైజ్ చేసిన విధానం బాగుంది. సూపర్ హీరో సినిమా కదా అని భారీ బడ్జెట్ కి వెళ్లిపోలేదు బాసిల్.. తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ను అందించాడు. అలాగే సీక్వెల్స్ కి సరిపడే తరహాలో ఎండింగ్ ను కూడా డిజైన్ చేశాడు.

కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్ అన్నీ సినిమాకి సెట్ అయ్యాయి.

విశ్లేషణ: ఒక ఇండియన్ సూపర్ హీరో సినిమాను చూడాలన్న ఆశక్తికి న్యాయం చేసే సినిమా “మిన్నల్ మురళి”. చిన్నపాటి పొరపాట్లు ఉన్నప్పటికీ.. కంటెంట్ వైజ్ మాత్రం మాంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే చిత్రమిది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని ఒకసారి కచ్చితంగా చూడాల్సిందే.

రేటింగ్: 3/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus