అందాల భామలు తెలుగు నేర్చుకునేందు ఆసక్తి కనబరుస్తున్నారు. సమంత, తమన్నా, తాప్సిలు తెలుగులో గల గలా మాట్లాడేస్తున్నారు. టాలీవుడ్ లో తమ స్థానం కొంతకాలం పదిల పరుచుకోవడానికి ఈ భాష పై మనసు పారేసుకుంటున్నారు. ఈ జాబితాలో గత ఏడాది మిస్ ఇండియా గా ఎంపికైన అదితి ఆర్య చేరింది. ఈమె త్వరలో తెరకెక్కనున్న పూరి జగన్నాథ్, కళ్యాణ్ రామ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఆడిషన్స్ సమయంలోనే అదితి ఆర్య తెలుగులో మాట్లాడిన బైట్ డైరక్టర్ కి పంపించి, తన ఆసక్తిని తెలియ పరిచింది.
“ఇండియాలోని చిత్ర పరిశ్రమల్లో అతిపెద్దది టాలీవుడ్. ఇక్కడ తీసే సినిమాలు బాలీవుడ్ లోనూ విజయం సాధిస్తున్నాయి.” అని అదితి ఆర్య చెప్పింది. ఆమె మాటలు వింటుంటే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందే తెలుగు పరిశ్రమని బాగా చదివేసినట్లు ఉంది. పూరి దర్శకత్వంలో నటించే అవకాశం గురించి అదితి మాట్లాడుతూ “నేను తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. అందులోనూ పూరి సార్ తీసిన పోకిరి, బిసినెస్ మాన్ అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలు చూసి మహేష్ బాబు కి ఫ్యాన్ అయిపోయాను. అందుకే పూరి సార్ కి నేను మిస్ ఇండియా కాక ముందే నటించడానికి ఓకే చెప్పాను” అని సంతోష పడుతోంది. ఈ అందాల సుందరి టాలీవుడ్ లో స్థిరపడిపోవడానికి స్పెషల్ క్లాసులు పెట్టించుకుని మరీ తెలుగు నేర్చు కుంటోందట.