పెద్ద పెద్ద సినిమాలు సైతం ట్రైలర్ ను ఒకవారం ముందు మాత్రమే విడుదల చేస్తున్న తరుణంలో ఒక కొత్త బృందం తాము తీసిన చిత్రాన్ని విడుదలకు రెండు రోజుల ముందే మీడియాకి స్పెషల్ షో వేసి.. “తప్పొప్పులు ఏమైనా ఉంటే చెప్పండి?” అని కోరడం ప్రత్యేకతను సంతరించుకుంది. మరి ఈ కొత్త బృందం చేసిన ప్రయత్నం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: గౌతమ్ (హర్ష నర్రా), శ్రుతి (నిక్కిషా)ల జంట పెళ్లి చేసుకొని సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. అప్పటివరకూ ఆనందంగా సాగుతున్న వారి జీవితాల్ని ఓ రోడ్ యాక్సిడెంట్ ఛిద్రం చేస్తుంది. శ్రుతి కనిపించకుండా పోతుంది. అదే యాక్సిడెంట్ లో గౌతమ్ కి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వస్తుంది. ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ తో మిస్ అయిన తన భార్య శ్రుతిని హర్ష ఎలా కనిపెట్టగలిగాడు? అసలు ఈ కథలో మీనా (మిషా నారంగ్) ఎందుకు ఇరుక్కుంది? శ్రుతి మిస్ అవ్వడానికి మీనాకి సంబంధం ఏమిటి? అనేది “మిస్సింగ్” కథాంశం.
నటీనటుల పనితీరు: అందరూ కొత్తవాళ్లే,కొన్ని సన్నివేశాల్లో సరైన ఎమోషన్స్ పండించలేకపోయారు. అయితే.. ఒక డిఫరెంట్ సినిమా చూస్తున్నామనే ఫీల్ కలిగిందంటే మాత్రం ఈ కొత్త నటీనటులే కారణం. హర్ష, నిక్కిషా, మిషా నారంగ్.. ఈ ముఖ్యపాత్రధారులందరూ చక్కని అభినయం ప్రదర్శించారు. అయితే.. కథలో ఉన్న డెప్త్ ను ఎలివేట్ చేయడంలో కాస్త తడబడ్డారు. ఆ చిన్నపాటి పొరపాట్లను పక్కన పెడితే అందరూ ఆకట్టుకున్నారు. చిన్న పాత్రలే అయినప్పటికీ ఛత్రపతి శేఖర్, రామ్ దత్ లు అలరించారు. వారి పాత్రలు కథనానికి తోడ్పడ్డాయి.
సాంకేతికవర్గం పనితీరు: ఉదయకుమార్ సౌండ్ డిజైన్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. కథలోని కీలకమైన అంశాలను బాగా ఎలివేట్ చేసాడు. జనా సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ముఖ్యంగా డార్క్ థీమ్ ను యూజ్ చేసుకొని చిత్రీకరించిన నైట్ షాట్స్ బాగున్నాయి. లైటింగ్ ను బాగా యుటిలైజ్ చేసుకున్నాడు. అజయ్ పాటలు, నేపధ్య సంగీతం బాగుంది. కాకపొతే.. క్రూషియల్ సీన్స్ ని బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఇంకాస్త ఎలివేట్ చేస్తే బాగుండేది. ప్రొడక్షన్ డిజైన్ పరంగా ఇంకాస్త ఖర్చు పెట్టి ఉంటే బాగుండేది. అయితే.. తక్కువ బడ్జెట్ లోనూ మంచి అవుట్ పుట్ ఇచ్చారు టీమ్.
ఇక దర్శకుడు శ్రీని జోస్యుల విషయానికి వస్తే.. తాను రాసుకున్న కథ కొత్తగా ఉంది. అయితే.. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే బాగుండేది. స్ప్లిట్ పర్సనాలిటీ అనేది తెలుగు ప్రేక్షకులకు తెలియని అంశం కాదు. దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి చెప్పే బదులు.. డైరెక్ట్ గా అదే కాన్సెప్ట్ తో సినిమాను మొదలుపెట్టి ఉంటే ఇంకాస్త కొత్తగా ఉండేది. ఒక సాదాసీదా సినిమాగా మొదలై టిపికల్ ఫిలింగా ఆడియన్స్ అవాక్కవ్వాలనే ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. అయితే.. సెకండాఫ్ లో రాసుకున్న ట్విస్టులు బాగా వర్కవుట్ చేయగలిగాడు శ్రీని.
విశ్లేషణ: ఒక కొత్త బృందం చేసిన కొత్త ప్రయత్నం “మిస్సింగ్”. ఎలాగూ భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్ కి వెళ్లరు కాబట్టి, ఒకింత ఆశ్చర్యచకితులై.. ఎగ్జైట్మెంట్ ను ఎంజాయ్ చేస్తారు. సో, ఈ కొత్త టీమ్ ప్రతిభను ప్రోత్సహిస్తూ.. వారిని ఎంకరేజ్ చేయడం కోసం ఒకసారి తప్పకుండా చూడదగిన చిత్రం “మిస్సింగ్”.