టాలీవుడ్లో అపజయమెరుగని దర్శకుల లిస్టులో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి కూడా చేరాడు. కాకపోతే అనిల్ రావిపూడికి 8 హిట్లు ఉన్నా.. అతని సినిమాలపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది అవి ఫ్లూక్ హిట్స్ అంటారు. ఇంకొంతమంది సంక్రాంతికి రాకపోతే అనిల్ రావిపూడి సినిమాలు పెద్ద హిట్లు అవ్వవు అని చెబుతారు.
ముఖ్యంగా ‘ఎఫ్ 3’ సినిమాతో అయితే అనిల్ రావిపూడి సినిమాల్లో క్రింజ్ కామెడీ ఎక్కువైంది అని విమర్శిస్తుంటారు. అన్నీ ఎలా ఉన్నా.. ‘ఎఫ్ 3’ సినిమా హిట్ అని ఎవ్వరూ మనస్ఫూర్తిగా ఒప్పుకోరు. పరుచూరి గోపాలకృష్ణ వంటి దిగ్గజ రైటర్లు కూడా ‘ఎఫ్ 3’ అనేది సెన్స్ లెస్ సినిమా అనేలా కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఈ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఓపెన్ అయ్యారు. తన సినిమాల్లో ‘ఎఫ్ 3’ రైటింగ్ వీక్ అని అతను ఒప్పుకున్నాడు.

ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “నేను ఇప్పటివరకు రిగ్రెట్ ఫీలయ్యే రైటింగ్ అయితే చేయలేదు అనుకుంటూ ఉంటాను. కానీ ‘ఎఫ్ 3’ విషయంలో మాత్రం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా చేశాను అని అనిపిస్తుంటుంది. ఆ సినిమా సెకండాఫ్ విషయంలో నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’..లా రియాలిటీకి దగ్గరగా తీసుంటే.. కచ్చితంగా దాని రిజల్ట్ ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంటుంది.
అయినప్పటికీ అది డీసెంట్ హిట్ అయ్యింది. నేను ఆ సినిమా విషయంలో పొరపాటు చేసినా ఆడియన్స్.. నాకు పాజిటివ్ రిజల్ట్ ఇచ్చారు. కానీ ప్రేక్షకులు చూసేస్తారులే అనే నిర్లక్ష్యంతో కాకుండా జాగ్రత్త పడుంటే.. కచ్చితంగా పెద్ద హిట్ అయ్యుండేది అని నాకు అనిపిస్తుంది. ఒక రకంగా అది నన్ను ఉలిక్కిపడేలా చేసింది. తర్వాత నుండి ప్రేక్షకులను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చాడు.
