కరోనా తర్వాత రామ్ కి ఒక్క బాక్సాఫీస్ కూడా పడలేదు. వరుసబెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ.. కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అందుకే తన పంథాను మార్చుకుని మరీ తనను తాను సరికొత్తగా, ఓ అభిమానిగా పరిచయం చేసుకుంటున్నాడు. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో రామ్ మంచి హిట్ అందుకున్నాడా లేదా? అనేది చూద్దాం..!!

కథ:
ఆంధ్ర కింగ్ సూర్య (ఉపేంద్ర).. ఆంధ్రదేశంలో ఈయనంటే తెలియని వారుండరు. 99 సినిమాల స్టార్ డమ్, ఓ 10 ఫ్లాపులతో దెబ్బతిని.. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన 100వ సినిమా డబ్బు సమస్య కారణంగా ఆగిపోతుంది. ఆ తరుణంలో ఏం చేయాలో తోచని పరిస్థితిలో.. తనకు అవసరమైన 3 కోట్ల రూపాయలను ఓ సాధారణ అభిమాని పంపించాడని తెలిసి షాక్ అవుతాడు సూర్య.
ఆ అభిమాని పేరు సాగర్ (రామ్) అని తెలుసుకొని.. అతడ్ని కలవడం కోసం ప్రయాణం మొదలుపెడతాడు. ఆ క్రమంలో సాగర్ జీవితం గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్న సూర్య.. చివరికి తన అభిమానిని కలిసాడా? 4 టికెట్లు కొనడానికి కూడా డబ్బులు లేని సాగర్.. తన అభిమాన కథానాయకుడికి 3 కోట్ల రూపాయలు ఎలా ఇవ్వగలిగాడు? అనేది “ఆంధ్ర కింగ్ తాలుకా” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

నటీనటుల పనితీరు:
లుక్స్, మ్యానరిజమ్స్, స్లాంగ్ వంటి విషయాల్లో రామ్ తన ఇమేజ్ కు భిన్నంగా, కొత్తగా కనిపించాడు. అదే సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఎక్కడా రామ్ కనిపించడు, సాగర్ మాత్రమే కనిపిస్తాడు. హీరోలు ఇలా తమ ఇమేజ్ ను బ్రేక్ చేసుకోవడం అనేది ఎంత ముఖ్యమో ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. ఇక నటుడిగానూ ఎమోషన్స్ ను అద్భుతంగా పండించాడు రామ్.
ఉపేంద్ర డబ్బింగ్ ఒక్కటే ఇబ్బందిపెట్టింది కానీ.. ఆయన రియల్ లైఫ్ కి ఈ క్యారెక్టర్ దగ్గరగా ఉండడం అనేది ప్లస్ అయ్యింది.
రావు రమేష్ మరోసారి తాను యాక్టర్లలో ఎవరెస్ట్ అని నిరూపించుకున్నాడు. ఓ సగటు తండ్రి బాధ్యతను, ప్రేమను, గర్వాన్ని ఆయన తన కళ్ళల్లో చూపించే విధానం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నటుడిగా ఆయన స్థాయిని మన దర్శకులు చాలా తక్కువగా వినియోగించుకుంటున్నారు. ఇలాంటి మంచి పాత్రలు పడినప్పుడు మాత్రం ఆయన తన 100% ఇచ్చేసి.. కంటతడి పెట్టించేస్తుంటాడు.
భాగ్యశ్రీ మంచి నటి అని ఇటీవల “కాంత” సినిమాతో ప్రూవ్ చేసుకుంది. ఈ సినిమాలోనూ తనదైన శైలి సబ్టల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. కాకపోతే.. లుక్స్ కారణంగా గోదావరి అమ్మాయిగా ఇమడలేకపోయింది.
మురళీశర్మకి ఈ తరహా పాత్రలు కొట్టిన పిండి లాంటివి. మిగతా సపోర్టింగ్ ఆర్టిస్టులందరూ తమ బెస్ట్ ఇచ్చారు.

సాంకేతికవర్గం పనితీరు:
సంగీత దర్శకులు వివేక్ – మెర్విన్ వల్ల ఈ సినిమా చాలా కొత్తగా అనిపించింది, వినిపించింది. మెలోడీ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది. మరీ ముఖ్యంగా రిపీటెడ్ బీజియం ఎక్కడా వినిపించలేదు. ఇక క్లైమాక్స్ లో రామ్-ఉపేంద్ర మధ్య వచ్చే సన్నివేశానికి ఈ ద్వయం ఇచ్చిన బీజియం ఆ సన్నివేశాన్ని ఐకానిక్ గా మార్చింది. ఆ సన్నివేశంలో జరుగుతుంది మ్యాజిక్ అని ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యేలా చేశారు.
సిద్ధార్థ్-జార్జ్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. 2000 కాలానికి తగ్గట్లుగా కలర్ టోన్ ను ఎంచుకున్న విధానం, కలరింగ్ & లైటింగ్ విషయంలో తీసుకున్న కేర్ ప్రశంసార్హం.
కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. ఆర్టిస్టుల లుక్స్ & పరిసరాలు చాలా సహజంగా ఉండేలా జాగ్రత్తపడ్డారు.
దర్శకుడు మహేష్ బాబు.. ఒక కొత్త పాయింట్ ను కొత్తగా చెప్పాలనుకున్న ప్రయత్నం కచ్చితంగా మెచ్చుకోవాలి. ఫలానా సీన్ లేదా ఎమోషన్ అల్రెడీ చూసేసామే అనే భావన ఎక్కడా కలగదు. అయితే.. రాసుకున్న సన్నివేశాన్ని ఎక్కడ కట్ చేయాలి అనే విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. ఎలాంటి ఎమోషన్ అయినా.. ఎంత సేపు అనుభూతి చెందితే బాగుంటుంది అనే మీటర్ ఒకటి ఉంటుంది. ఆ మీటర్ కు తగ్గట్లుగా సన్నివేశాన్ని ముగిస్తేనే.. ఎమోషన్ వర్కవుట్ అవుతుంది. మహేష్ ఈ విషయంలో కాస్త జాగ్రత్తపడాల్సింది. ఎమోషన్ బాగున్నా.. అది మరీ ఎక్కువగా సాగుతుంది. ఉదాహరణకు.. హీరోహీరోయిన్లు థియేటర్లో ముద్దు పెట్టుకునే సందర్భాన్ని హీరోయిన్ తండ్రి చూడడం అనే సీన్ కొత్తగా రాసుకున్నా.. దాన్ని లాంగ్ షాట్ లో ప్యాన్ చేసి.. అక్కడి నుండి హీరోయిన్ ఫాదర్ కి జూమ్ ఇన్ చేసి.. ఆ తర్వాత తెర చూపించడం అనేది ఇంచుమించిగా నిమిషం ఉంటుంది. అక్కడ ఉండాల్సింది షాక్ వెల్యూ కానీ.. ఎమోషనల్ జర్నీ కాదు. సో, ఇలాంటి అవసరానికి మించి సాగదీసిన సన్నివేశాల సంఖ్య మరీ ఎక్కువగా ఉండడం అనేది సినిమాకి మైనస్. అలాగే.. సినిమాకి చాలా కీలకమైన క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం కూడా కిక్ ఇవ్వలేకపోయింది. ఈ విషయాల్లో మహేష్ ఇంకాస్త కేర్ తీసుకొని.. సీన్ కంపోజిషన్స్ లో చూపిన నవ్యత, ముగింపులోనూ చూపించి ఉంటే సినిమా ఇంకాస్త పెద్ద హిట్ అయ్యేది. అయినప్పటికీ.. ఒక ఫ్యాన్ ఎమోషన్ ను క్యాప్చూర్ చేసిన విధానం మాత్రం ప్రశంసనీయం. మరీ ముఖ్యంగా.. ఫ్యానిజం అనేది అస్తమానం సినిమాలు చూడడం వల్లే రాదు, ఓ వ్యక్తిని అభిమానించడానికి అతడ్ని లేదా అతడి సినిమాలు చూడాల్సిన అవసరం లేదు.. అనే పాయింట్ ను బాగా డీల్ చేశాడు మహేష్. ఆ విషయంలో మాత్రం మహేష్ ను కచ్చితంగా మెచ్చుకోవాలి.

విశ్లేషణ:
కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నప్పటికీ.. ఫ్యాన్ ఎమోషన్స్ ను చాలా స్వచ్ఛంగా చూపించడం అనేది “ఆంధ్ర కింగ్ తాలుకా” చిత్రానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సరికొత్తగా కనిపించిన రామ్, సినిమాని ఫ్రెష్ గా ఫీలయ్యేలా చేసిన వివేక్-మెర్విన్ ల సంగీతం, మెలోడ్రామాలో అతి లేకుండా జాగ్రత్తపడుతూ వచ్చిన దర్శకుడు మహేష్ బాబు పనితనం ఈ చిత్రాన్ని కచ్చితంగా థియేటర్లో చూసి ఆస్వాదించేలా చేశాయి. కరోనా తర్వాత రామ్ కి “ఆంధ్ర కింగ్ తాలుకా” చిత్రంతో మంచి హిట్ పడినట్లే. అయితే.. అమెరికా వెళ్లిన రామ్, అక్కడ నుండి త్వరగా ఇండియాకి వచ్చి.. రూరల్ ఏరియాల్లో సినిమాని ఇంకాస్త ప్రమోట్ చేస్తే కలెక్షన్స్ కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది.

ఫోకస్ పాయింట్: వెండితెరపై ఆవిష్కృతమైన స్వచ్ఛమైన అభిమానం!
రేటింగ్: 3/5
