Mohanlal : మలయాళ చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న సీనియర్ నటుడు మోహన్ లాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు అత్యంత ప్రియమైన తల్లి శాంతకుమారి (90) నేడు తుదిశ్వాస విడిచారు. వయసు పైబడటంతో పాటు వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె, కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే ఇంటికి చేరినట్లు సమాచారం. అయితే ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో ఎర్నాకులం జిల్లా ఎలమక్కరలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆ సమయంలో మోహన్‌లాల్ కొచ్చిలోనే ఉన్నారు.
తల్లి మరణ వార్త అందుకున్న వెంటనే మోహన్‌లాల్‌తో పాటు కుటుంబ సభ్యులు అంతా ఎర్నాకులం చేరుకున్నారు. శాంతకుమారి అంత్యక్రియలను బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఈ వార్త వెలువడగానే మలయాళంతో పాటు ఇతర భాషల సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.
మోహన్‌లాల్‌కు తన తల్లి అంటే ఎంతటి ప్రేమ, గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ సోషల్ మీడియాలో ఆమెతో ఉన్న జ్ఞాపకాలను అభిమానులతో పంచుకునేవారు. ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ భావోద్వేగ పోస్ట్ చేశారు. అంతేకాదు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న వెంటనే నేరుగా తల్లిని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్న ఘటన అభిమానులను కదిలించింది.
ఇలాంటి సమయంలో మాతృవియోగం కలగడం మోహన్‌లాల్‌కే కాదు, ఆయనను అభిమానించే కోట్లాది మందిని కూడా విషాదంలో ముంచెత్తింది. మరోవైపు కెరీర్ పరంగా బిజీగా ఉన్న మోహన్‌లాల్ ఇటీవల వృషభ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యక్తిగత నష్టం ఆయన మనసును ఎంతగానో కలచివేస్తోంది. అభిమానులు ఆయనకు ధైర్యం చేకూరాలని ప్రార్థిస్తూ శాంతకుమారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.