అతనో స్టార్ హీరో తనయుడు. సినిమాల్లో యాక్ట్ చేసి మంచి నటుడు అని కూడా అనిపించుకున్నారు. ఉ అంటే వరుస సినిమాలు వస్తాయి. తండ్రిని చూసి.. ఆ హీరో టాలెంట్ చూసే అవకాశాలు ఇస్తారు. అలాంటి యువ నటుడు దేశం కాని దేశంలో కూలి పని చేస్తున్నాడు అని మీకు తెలుసా? అది కూడా రోజు కూలికి వర్క్ చేస్తున్నాడు. అతనే ప్రముఖ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) తనయుడు ప్రణవ్ మోహన్ లాల్.
బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభంచి, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి.. కొన్ని రోజుల తర్వాత హీరోగా కూడా మారాడు. అతను నటించిన ‘హృదయం’ సినిమా మలయాళంలోనే గాక ఓటీటీ ద్వారా అన్ని భాషల్లోనూ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ‘వర్షంగళకుశేషం’ అనే సినిమాలో కూడా నటించాడు. అయితే ప్రపంచం చూద్దామని ప్రణవ్ ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చి విదేశాలకు వెళ్లాడట.
స్పెయిన్‌లోని ఓ ప్రాంతంలో ఉంటున్నాడట. అక్కడ ఏ లగ్జరీ లైఫో, హై క్లాస్ లైఫో లీడ్ చేస్తున్నాడు అంటే పొరపాటే. అక్కడ ఓ ఫామ్‌లో రోజువారీ కూలీకి పని చేస్తున్నాడట. గొర్రెలు కాయడం, గుర్రాలను చూసుకోవడం లాంటి పనులు చేస్తున్నాడట. అంతేకాదు ఆ పనికి జీతం కూడా ఏమీ ఉండదు. భోజనం పెట్టి, ఆ ఫామ్ లోనే షెల్టర్ ఇస్తారట. ఎందుకు అని ఆమె మాతృమూర్తి సుచిత్రను అడిగితే.. ఎంతో ఇష్టపడి ప్రణవ్ ఆ పిన చేస్తున్నాడని చెప్పారు.
దీనిని విదేశాల్లో ‘వర్క్ అవే’ అని అంటుంటారు. చాలా మంది ఇలా ఎంతో దూరం నుండి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ కొన్నాళ్లు లైఫ్ లీడ్ చేస్తుంటారట. సమాజంలో అన్ని రకాల అనుభవాలను సంపాదించడం దీని వెనుక ఉద్దేశంగా భావిస్తుంటారట. మరి ప్రణవ్ మోహన్‌లాల్ ఎందుకు చేస్తున్నాడు అనేది ఆయనే చెప్పాలి. ఆయన సోషల్ మీడియా ఫొటోలు చూస్తుంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని అర్థమవుతోంది.