MOVIE RULZ: ఐబొమ్మ సైలెంట్.. ‘మూవీ రూల్జ్’ వైలెంట్! పోలీసులకే ఓపెన్ ఛాలెంజ్

టాలీవుడ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రధాన సమస్య పైరసీ. మొన్నటికి మొన్న ‘ఐబొమ్మ’ అడ్మిన్ రవిని పోలీసులు అరెస్ట్ చేయడంతో, ఇక ఇండస్ట్రీకి పట్టన చీడ వదిలిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఐబొమ్మ కథ ముగిసిందేమో గానీ, దానికి బాబు లాంటి ‘మూవీ రూల్జ్’ మాత్రం పోలీసులకే సవాల్ విసురుతోంది. మేము తగ్గేదేలే అన్నట్లుగా, థియేటర్లో బొమ్మ పడిన గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్లను ఆన్‌లైన్‌లో వదిలి, నిర్మాతలను నిలువునా ముంచేస్తోంది.

MOVIE RULZ

పోలీసులకు, ఈ డిజిటల్ దొంగలకు మధ్య జరుగుతున్నది మామూలు యుద్ధం కాదు. సైబర్ క్రైమ్ పోలీసులు ఒక డొమైన్‌ను బ్లాక్ చేస్తే, కనురెప్ప వేసే లోపే మరో కొత్త ఎక్స్‌టెన్షన్‌తో సైట్ దర్శనమిస్తోంది. ఒక తల నరికేస్తే మరో పది తలలు పుట్టుకొస్తున్నట్లుగా ఈ వెబ్‌సైట్ వ్యవహారం ఉంది. టెక్నికల్‌గా ఎంతో అడ్వాన్స్‌డ్ గా ఉన్న వీళ్లు, పోలీసుల చర్యలను ఏమాత్రం లెక్కచేయడం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పుడు ఈ దందా కేవలం వెబ్‌సైట్లకే పరిమితం కాలేదు. పోలీసులు ఉచ్చు బిగిస్తున్న కొద్దీ, పైరసీ గాళ్లు తమ రూట్ మారుస్తున్నారు. వెబ్ లింకులు బ్లాక్ అయితే, వెంటనే టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రైవేట్ లింకులు పెడుతున్నారు. వీపీఎన్ టెక్నాలజీని వాడుకుంటూ చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటున్నారు. టెక్నాలజీ వార్‌లో పోలీసుల కంటే పైరసీ రాయుళ్లే ఒక అడుగు ముందున్నారనే చేదు నిజాన్ని ఇది బయటపెడుతోంది.

ఈ డిజిటల్ దోపిడీ వల్ల ఎక్కువగా బలవుతున్నది చిన్న, మధ్య తరహా సినిమాలే. స్టార్ హీరోల సినిమాలకు ఎలాగూ ఓపెనింగ్స్ వస్తాయి. కానీ కంటెంట్ ఉన్న చిన్న సినిమాకి ‘మౌత్ టాక్’ వచ్చేలోపే, ఆ సినిమా స్మార్ట్ ఫోన్లలోకి వచ్చేస్తోంది. దీంతో థియేటర్ వైపు జనం చూడటం మానేస్తున్నారు. “మా కష్టాన్ని ఇలా ఫ్రీగా దోచుకుంటున్నారు” అని బన్నీ వాసు లాంటి నిర్మాతలు ఎంత గగ్గోలు పెడుతున్నా, ఉచిత వినోదానికి అలవాటు పడ్డ ప్రేక్షకుల మైండ్ సెట్ మారడం లేదు. మొత్తానికి ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది పైరసీ సముద్రంలో ఒక చిన్న అలజడి మాత్రమే. అసలైన మొసలి ‘మూవీ రూల్జ్’ ఇంకా వేటాడుతూనే ఉంది. ఈ పెద్ద చేపను పట్టుకుంటే తప్ప, టాలీవుడ్ కష్టాలు తీరవు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus