ఒకసారి నటించిన హీరోయిన్‌తో మరోసారి నటించడం హీరోలకు సర్వసాధారణం. అయితే ఇదంతా ఇప్పుడు కాదు ఒకప్పుడు. వరుసగా నటించి ఒక్కో కాంబోలో 15కిపైగా సినిమాలు వచ్చేలా చేశారు. అయితే ఇప్పుడు ఒక సినిమా తర్వాత మరో సినిమా అనే కాన్సెప్ట్‌లో మన హీరోలు ఉండటంతో ఏడాదికి ఒకట్రెండు సినిమాలే కుదురుతున్నాయి. ఇక హీరోయిన్‌తో అన్నేసి సినిమాలు చాలా కష్టం. కనీసం ఒకే హీరోయిన్ వెంటవెంటనే రెండు సినిమాలు చేయడమూ కష్టమే.
ఇలాంటి రోజుల్లో ఓ హీరో – హీరోయిన్ ఎట్ ఏ టైమ్‌లో రెండు సినిమాల్లో కలసి నటిస్తున్నారు. వినడానికి విచిత్రంగా అనిపించినా… మీరు చదివింది నిజమే. ఎందుకంటే అలాంటి ప్రాజెక్టులు రెండు రెడీ అవుతున్నాయి. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేస్తారట. ఇంత చెప్పారు ఆ హీరో, హీరోయిన్ ఎవరో చెప్పలేదు అనుకుంటున్నారా? వస్తున్నాం అక్కడికే వస్తున్నాం. ఆ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాగా, హీరో లారెన్స్.
అవును, వీరి కాంబోలోనే రెండు సినిమాలు దాదాపు ఓకే అయ్యాకట. అంతేకాదు ఈ రెండు ప్రాజెక్టుల షూటింగ్ సైమల్టేనియస్‌గా జరిగేలా ప్లాన్స్ వేస్తున్నారట. ఇక మృణాల్ ఠాకూర్ స్పీడు మామూలుగా లేదనే విషయం తెలిసిందే. ‘సీతా రామం’ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి వరుస సినిమాలు సంతకాలు చేసేసింది. అందుకే వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొన్నీమధ్యే ‘హాయ్ నాన్న’ రాగా, మార్చిలో ‘ఫ్యామిలీ స్టార్’ వస్తోంది.
ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అందులో లారెన్స్ సినిమాలు రెండు ఉన్నాయి అంటున్నారు. లారెన్స్ కథానాయకుడిగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకు ‘శ్రీరామ రక్ష’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్‌ని తీసుకున్నారట. అలాగే తమిళ దర్శకుడు రవి కుమార్‌తో లారెన్స్ మరో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలోనూ (Mrunal Thakur) మృణాల్‌నే కథానాయికగా ఎంపిక చేశారట.
శివ కార్తికేయన్ తో ‘అయలాన్’ అనే సినిమా చేస్తున్న రవి కుమార్ ఆ తర్వాత లారెన్స్ సినిమా చేస్తాడట. అందులో కథానాయిక పాత్రకు మృణాల్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. అందుకే ఆమెనే తీసుకున్నారట. అన్నట్లు ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటాయట.