మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి కెరీర్లో ‘ముగ్గురు మొనగాళ్లు'(Mugguru Monagallu) చాలా స్పెషల్. ఎందుకంటే చిరు త్రిపాత్రాభినయం కనపరిచిన ఏకైక సినిమా ఇది. తమ్ముడు నాగబాబుని నిర్మాతగా నిలబెట్టేందుకు అప్పటికే ‘రుద్రవీణ’ ‘త్రినేత్రుడు’ వంటి సినిమాలు చేశారు చిరు. ‘రుద్రవీణ’ కి మంచి పేరొచ్చింది కానీ డబ్బులు రాలేదు. దీంతో మైల్ స్టోన్ మూవీ అంటే 100వ సినిమాని నిర్మించే ఛాన్స్ కూడా నాగబాబుకి ఇచ్చారు చిరు. అది కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో మూడో ప్రయత్నంగా ‘ముగ్గురు మొనగాళ్లు’ నిర్మించే ఛాన్స్ ఇచ్చారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. వీరి కాంబినేషన్ అనగానే అందరికీ ‘మంచి దొంగ’ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ‘ఘరానా మొగుడు’ ‘రౌడీ అల్లుడు’ వంటి సూపర్ హిట్లు గుర్తుకొస్తాయి. దానివల్లే ‘ముగ్గురు మొనగాళ్లు’ పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.1994 వ సంవత్సరం జనవరి 7న ఈ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.
పృథ్వీ (లారీ డ్రైవర్), విక్రమ్ (ఎసిపి),దత్తాత్రేయ (డాన్స్ మాస్టర్) వంటి మూడు విభిన్నమైన పాత్రల్లో నట విశ్వరూపం చూపించారు చిరు.కానీ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. అయితే అందరి మైండ్లో ఓ ప్రశ్న ఉండేది. 3 రకాల పాత్రలు చిరు ఎలా పోషించారు? ఫిజిక్ విషయంలో అంత మార్పు ఎలా సాధ్యమైంది అని.? వాస్తవానికి మిగిలిన 2 పాత్రలు చేసింది చిరు కాదు. డూప్స్ తో చేయించారు.
ఆ డూప్ గా చేసింది కూడా మరెవరో కాదు.. చిరంజీవికి అత్యంత సన్నిహితులే. ఒకరు సుబ్బారావు. ఈయన చిరంజీవి పర్సనల్ అసిస్టెంట్. మరొకరు హరిబాబు… ఇతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే సంగతి తెలిసిందే. ఒకే ఫ్రేమ్లో కనిపించాల్సి వచ్చినప్పుడు వీరిద్దరినీ డూప్స్ గా పెట్టి.. సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ విషయాన్ని బాడీ డబుల్స్ పద్ధతి ఆ రోజుల నుండే ఉంది అనేది అర్ధం చేసుకోవచ్చు.నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 32 ఏళ్ళు పూర్తికావస్తోంది.