150కిపైగా సినిమాలకు స్వరాలు సమకూర్చిన ప్రముఖ దక్షిణ భారత సినిమాల సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేశ్ (70) కన్నుమూశారు. మంగళవారం చెన్నైలో గుండెపోటుతో మరణించినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. తమిళనాడులో జన్మించిన వెంకటేశ్ తొలి రోజుల్లో ఓ ఆర్కెస్ట్రాలో పని చేశారు. ఆ తర్వాత కొంతమంది సంగీత దర్శకులు దగ్గర సహాయకుడిగా పని చేశారు. ‘జానకీయ కోదాతి’ అనే సినిమాతో 1985లో మలయాళ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు.
తండ్రి పళని మాండలిన్ కళాకారుడు కావడంతో.. మూడేళ్ల వయసు నుండే ఆయన వద్ద వెంకటేశ్ శిష్యరికం చేశారు. మాండలిన్‌తోపాటు సంగీత వాయిద్యాల్లోనూ శిక్షణ పొందారు. 1993లో కేరళ ప్రభుత్వం నుండి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో సుమారు 150 సినిమాలకు పని చేశారు. మొత్తంగా 500కుపైగా పాటలకు సంగీతం అందించారు. ఆయన సంగీతంలోని పాటలను ఎక్కువగా ప్రముఖ గాయని చిత్ర పాడటం విశేషం.