తమన్ కి (Thaman) ట్రోలింగ్ కొత్త కాదు. అతనికి అలవాటైపోయినట్టు కూడా తమన్ చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ‘నన్ను మొదటి నుండి ట్రోల్ చేస్తుంది ఒక్కడే. నాకు హిట్ వచ్చినా, ప్లాప్ వచ్చినా.. వాడు ట్రోల్ చేస్తూనే ఉన్నాడు. అలాంటి వాళ్ళని నేను పట్టించుకోను అంత ఖాళీ నాకు లేదు’ అంటూ గతంలో తమన్ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో.. ట్రోలింగ్ గురించి తెగ బాధపడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
ఈ సంక్రాంతికి తమన్ మ్యూజిక్ అందించిన ‘గేమ్ ఛేంజర్’ (Game changer) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ కి ప్రశంసలు దక్కాయి. కానీ ఎందుకో తమన్ అప్సెట్ అయ్యాడు. తాజాగా జరిగిన సక్సెస్ మీట్లో తమన్ మాట్లాడుతూ.. “మేము ఎంత పని చేసినా అది సక్సెస్ కోసమే. అది సాధించడమే గగనం అయిపోతుంది. అయితే ఇప్పుడున్న ట్రోల్స్ నడుమ ఆ సక్సెస్ ని తీసుకెళ్లి నిర్మాత చేతుల్లో పెట్టడం అనేది ఇంకా కష్టమైపోతుంది.
నిర్మాత బాగుంటేనే మేము బాగుంటాం. దేశం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తుంది. నేను హిందీలో ‘బేబీ జాన్’ (Baby John) చేస్తున్నప్పుడు అక్కడి నిర్మాత తెలుగులో సినిమా చేయాలి ఏ హీరోతో చేయాలి అని అడుగుతారు. అలాగే తమిళ్, మలయాళం, కన్నడ.. ఫిలిం మేకర్స్ కూడా మన తెలుగు హీరోలతో సినిమాలు చేయాలని చూస్తున్నారు. మన తెలుగు సినిమాలు దేశ, విదేశాల్లో రిలీజ్ అవుతున్నాయి. జపాన్, చైనా ఇలా అన్ని భాషల్లోనూ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి.
కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ తో మన సినిమాని మనమే చంపేసుకుంటున్నాం. సినిమా బాగోకపోతే ఓకే. కానీ బాగున్న సినిమాకి కూడా ట్రోల్స్ ఎందుకు? నాకు ఈ ట్రోలింగ్ చూస్తుంటే భయమేస్తుంది. భవిష్యత్తులో నాకు నిర్మాతలు ఆఫర్లు ఇస్తారా? లేదా? అనే భయం నాకు కలుగుతుంది. నేను ఇంత సీరియస్ గా ఎప్పుడూ మాట్లాడలేదు. నాకు క్రికెట్ ఆడుతున్నప్పుడు మాత్రమే చెమటలు పడతాయి. కానీ మొదటిసారి మైక్ పట్టుకున్నప్పుడు చెమటలు వస్తున్నాయి” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.