విశ్వక్ సేన్ (Vishwak Sen) వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. 3,4 నెలలకు ఒక సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉన్నాడు. అవి హిట్ అవుతున్నాయా? లేదా? అనేది తర్వాత. విశ్వక్ సేన్ సినిమా అంటే యూత్ లో ఓ ఆసక్తి ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు అతనితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. విశ్వక్ సేన్ నుండి రాబోతున్న నెక్స్ట్ మూవీ ‘లైలా’ (Laila).
‘షైన్ స్క్రీన్స్’ సంస్థపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో కనిపించబోతున్న సంగతి ముందు నుండి హైలెట్ చేస్తూ వచ్చారు. అది పబ్లిసిటీకి బాగా ఉపయోగపడింది. కొంత పబ్లిసిటీ తెచ్చి పెట్టినట్టు అయ్యింది. ఇక ప్రమోషన్లలో భాగంగా తాజాగా ‘లైలా’ టీజర్ ను యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1:43 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఇందులో హీరో విశ్వక్ సేన్ సోను అనే ఓల్డ్ సిటీ కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడు.
తన ఏరియాలో ఆడవాళ్ళ బ్యూటీ పార్లర్ నడిపే కుర్రాడుగా కామెడీ చేస్తున్నాడు. అంతేకాదు లేడీస్ కి చీరలు కట్టడం వంటి పనులు కూడా చేస్తుంటాడు. అయితే లేడీస్ కి ఉండే సదుపాయాలు తాను కూడా పొందేందుకు అమ్మాయి గెటప్ వేయాలనుకుంటాడు. ‘దాని ద్వారా అతనికి ఎలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి?’ అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది. ‘ఒక్కొక్కడి చిలకలు కోసి చీరలు కట్టి పంపిస్తా’ వంటి విశ్వక్ సేన్ మార్క్ డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఉన్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :