ముత్తయ్య మురళీధరన్ గారి బయోపిక్ ‘800’ను ఇండియాలోనే 1100 థియేటర్లలో విడుదల చేస్తున్నాం :నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్

లెజెండరీ క్రికెటర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్ ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. ముత్తయ్య పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, ఆయన భార్య మదిమలర్ పాత్రలో హీరోయిన్ మహిమా నంబియార్ నటించారు. ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ భాషల్లో ఆయన విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో శివలెంక కృష్ణ ప్రసాద్ ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…

దర్శకుడు శ్రీపతి మీకు ముందు నుంచి తెలుసని చెప్పారు. ఆయన ఎలా తెలుసు?
ఎస్పీ బాలసుబ్రమణ్యం అంకుల్ గారికి, నాకు కామన్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. ఆయనకు శ్రీపతి తెలుసు. వాళ్లది కోయంబత్తూరులో సెటిలైన తెలుగు కుటుంబం. అతను తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతాడు. సినిమాలు అంటే ఆసక్తి. ఫిలిం మేకింగ్ కోర్సులు కూడా ఏవో చేశాడు. కామన్ ఫ్రెండ్ అడగడంతో ఎస్పీ చరణ్ తమిళంలో ‘వర్షం’ రీమేక్ చేసినప్పుడు… ఆ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా తీసుకున్నా. ఆ సినిమా నిర్మాణ బాధ్యతలు అన్ని నేనే చూశా. ఆ తర్వాత వెంకట్ ప్రభు దగ్గర నాలుగైదు సినిమాలకు దర్శకత్వ శాఖలో శ్రీపతి పని చేశాడు. మా నిర్మాణ సంస్థలోనే దర్శకుడిగా పరిచయం చేయాలని అనుకున్నాం. అయితే ముత్తయ్య మురళీధర్ బయోపిక్ చేసే అవకాశం వచ్చిందని చెబితే సంతోషంగా ఆ సినిమా చేసి రమ్మని నేనే చెప్పా.

శ్రీపతి చెప్పడంతో 800 తీసుకున్నానని అన్నారు కదా! మీరు ఈ సినిమాలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు?
ఆగస్టు తొలి వారంలో అనుకుంటా… శ్రీపతి నుంచి ఫోన్ వచ్చింది. ‘సార్… మీరు 800 సినిమాను టేక్ ఓవర్ చేయాలి’ అని అడిగాడు. దీనికి ముందు ఒక విషయం చెప్పాలి… ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో శ్రీపతి నాకు చెబుతూ వస్తున్నాడు. షూటింగ్ చేయడానికి లండన్ వెళ్లినా, ముత్తయ్య మురళీధరన్ గారి సొంతూరు వెళ్ళినా… ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ ఇస్తున్నాడు. అందువల్ల నాకు సినిమా గురించి తెలుసు. అయితే… ముందు ఒకసారి మురళీధరన్ గారితో మాట్లాడమని చెప్పా. అర గంటకు ఆయన నుంచి నాకు ఫోన్ వచ్చింది. ‘మీ గురించి శ్రీపతి ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. నేను కూడా విన్నాను. మీరు సినిమా విడుదల చేస్తే నాకు సంతోషం’ అని మురళీధరన్ గారు చెప్పారు. అలా నేను ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యా.

నిర్మాతగా మీరు చేసే సినిమాలు అన్నిటికీ దగ్గర ఉండి స్క్రిప్ట్ వర్క్ చేయించుకోవడం, ప్రొడక్షన్ చూసుకోవడం అలవాటు. ‘800’ను మీరు టేక్ ఓవర్ చేసిన తర్వాత మార్పులు చేర్పులు ఏమైనా చేశారా?
ఏమి చేయలేదు. బయోపిక్ కదా… మార్చడానికి ఏం ఉంటుంది? ఉన్నది ఉన్నట్టుగా తీశారు. అలాగని ఇదేదో డాక్యుమెంటరీలా ఉంటుందని అనుకోవద్దు. మురళీధరన్ గారి జీవితంలో కమర్షియల్ హంగులు అన్నీ ఉన్నాయి. ఒక మనిషి జీవితం ఇలా ఉంటుందా? ఎన్ని అవరోధాలు ఎదుర్కొని ఆయన ఈ స్థాయికి చేరుకున్నారా? అని ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా, తెరపై సన్నివేశాలు అలా చూస్తూ ఉండేలా సినిమా ఉంటుంది. శ్రీపతి కూడా ముత్తయ్య మురళీధరన్ గారికి స్క్రిప్ట్ అంతా చూపించి అనుమతి తీసుకుని సినిమా తీశాడు. మురళీధరన్ గారికి లేనిది చెప్పడం అసలు ఇష్టం లేదు.

మన తెలుగు హీరో నాని గారికి కూడా కథ వినిపించారని విన్నాం! అది నిజమేనా?
అవును. విజయ్ సేతుపతి గారితో సినిమా తీయాలని అనుకోవడం, తమిళనాడులో కొంతమంది గొడవ చేయడంతో కాంట్రవర్సీలు వద్దని సేతుపతి గారు తప్పుకోవడం తెలిసిన విషయాలే. అప్పుడు నానికి కథ చెప్పాలని శ్రీపతి ప్రయత్నించారు. అప్పటికి నాని ‘జెర్సీ’ చేసి ఏడాదిన్నర మాత్రమే అయింది. క్రికెట్ నేపథ్యంలో మరో సినిమా అంటే నాని గారు కూడా ఆలోచించాలి. మురళీధరన్ గారికి నాని అంటే ఇష్టం. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు! నేను కూడా చెప్పడంతో ‘కథ వింటాను కానీ సినిమా చేయలేను’ అని నాని ముందే చెప్పారు. కథ విన్నాక ‘చాలా బాగుంది’ అన్నారు.

800 ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగూలీ వీవీఎస్ లక్ష్మణ్ అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లను మీరు కలిశారు. ఈ ప్రయాణంలో మర్చిపోలేని అనుభూతి?
వాళ్లందరినీ కలవడమే ఒక పెద్ద అనుభూతి. ప్రతి ఒక్కరూ చాలా డౌన్ టు ఎర్త్. ఈ జర్నీ మంచి మెమొరబుల్ అని చెప్పాలి.

800 చిత్రాన్ని ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు?
ఇండియాలో సుమారు 1100 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. మేం ఎక్కువగా మల్టీప్లెక్స్ స్క్రీన్ ల మీద దృష్టి పెట్టాం. తర్వాత మెల్లగా థియేటర్లు పెంచుతూ వెళ్తాం. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో నైజాం సునీల్ నారంగ్, విశాఖ & ఉత్తరాంధ్ర దిల్ రాజు, ఈస్ట్ గోదావరి గీతా ఫిలింస్, వెస్ట్ గోదావరి ఎల్.వి.ఆర్, కృష్ణాజిల్లా అన్నపూర్ణ స్టూడియోస్, నెల్లూరు అంజలి పిక్చర్స్ భాస్కర్ రెడ్డి, సీడెడ్ ఎస్ సినిమాస్, గుంటూరు పద్మాకర్ సినిమాస్…. ఇలా పేరున్నవారు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు. ‘యశోద’ను నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన యుఎఫ్ఓ సంస్థ 800 చిత్రాన్ని కూడా డిస్టిబ్యూట్ చేస్తోంది.

శ్రీలంకలో కూడా విడుదల చేస్తున్నారు కదా! ఆ రిలీజ్ కూడా మీరే చూస్తున్నారా?
ముత్తయ్య మురళీధరన్ గారి సొంతూరు అది! అక్కడ రిలీజ్ వరకు ఆయనే చూస్తున్నారు. నేను ఇండియా, ఓవర్సీస్ రిలీజ్ విషయాలు చూస్తున్నా. ఈ సినిమాను తమిళంలో తీశారు. తెలుగుతో పాటు హిందీలో విడుదల చేస్తే బాగుంటుందని చెప్పా.

మురళీధరన్ గారు తెలుగు సినిమాలు చాలా చూశానని చెప్పారు. మీ మధ్య సినిమా డిస్కషన్స్ వచ్చాయా?
చాలా వచ్చాయి. తమిళంలో డబ్బింగ్ అయినా తెలుగు సినిమాలు అన్నిటినీ ఆయన చూశారు. తెలుగు హీరోలలో కూడా ఆయనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ‘800’ ఫ్రీ రిలీజ్ వేడుకకు విక్టరీ వెంకటేష్ గారు కూడా రావాల్సింది. ‘సైంధవ్’ షూటింగ్ ఉండడంతో ఆయన రాలేకపోయారు. సెప్టెంబరు 26 వరకు ఆ సినిమా షెడ్యూల్ జరిగింది. మేం 25న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాం. అయితే వెంకటేష్ గారు ఫోన్ చేసి మాట్లాడారు.

నిర్మాతగా మీరు చేయబోయే కొత్త సినిమాలు?
‘800’ దర్శకుడు శ్రీపతి చేయబోయే తదుపరి సినిమా నేనే నిర్మిస్తున్నా. ‘యశోద’ దర్శకులతో ఒక సినిమా ఉంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాం. దర్శకుడు పవన్ సాధినేనితో చర్చలు జరుగుతున్నాయి. అతను ఒక మంచి పాయింట్ చెప్పాడు. తెలుగులో ‘వదలడు’ పేరుతో విడుదలైన సిద్ధార్థ సినిమా దర్శకుడు సాయి శేఖర్ సైతం ఓ కథ చెప్పాడు. నాలుగైదు కథలు రెడీ అవుతున్నాయి. హీరోలకు వినిపించి ఆ తర్వాత సినిమాలు ప్రకటిస్తా. నా కెరీర్ చూస్తే ఓ సినిమాతో మరో సినిమాకు సంబంధం లేకుండా డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తూ ఉంటా. నెక్స్ట్ నేను ప్రొడ్యూస్ చేయబోయే సినిమాలు కూడా గత సినిమాలతో పోలిస్తే వైవిధ్యంగా ఉంటాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus