Mythri Movie Makers: మైత్రీ 2026.. ఆ నలుగురిని నమ్మి వెయ్యి కోట్లు?

‘శ్రీమంతుడు’తో మొదలైన మైత్రి మూవీ మేకర్స్ ప్రస్థానం, పదేళ్లు తిరిగేసరికి పాన్ ఇండియా స్థాయికి చేరింది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా వెలుగొందుతున్న మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు 2026 సంవత్సరంలో ఊహించని టార్గెట్ పెట్టుకుంది. ఒకే ఏడాదిలో ఏకంగా నలుగురు టాప్ హీరోలతో, వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‌తో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతోంది.

Mythri Movie Makers

2026లో మైత్రీ లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న ‘పెద్ది’ (రూ.300 కోట్లు), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (రూ.150 కోట్లు), పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ – హను రాఘవపూడిల ‘ఫౌజీ’ (రూ.350-400 కోట్లు), యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ల విధ్వంసకర కాంబో ‘డ్రాగన్’ (రూ.50+ కోట్లు).. ఇలా ప్రతీ సినిమా ఒకదానికొకటి పోటీపడే రేంజ్‌లో ఉన్నాయి.

ఈ నలుగురు హీరోలను, వారి క్రేజ్‌ను నమ్మి మైత్రీ సంస్థ పెడుతున్న పెట్టుబడి అక్షరాలా వెయ్యి కోట్లకు పైమాటే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ నలుగురు హీరోలకు ఉన్న మార్కెట్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ ‘RRR’ తర్వాత గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తుంటే, పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రభాస్, ఎన్టీఆర్ ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్‌ను ఏలుతున్నారు. వీరందరినీ ఒకే ఏడాదిలో బరిలోకి దించడం అంటే, మైత్రీ సంస్థ ఆల్ ఇన్ వెళ్లినట్లే. ఇది చూడ్డానికి గ్రాండ్‌గా ఉన్నా, దీని వెనుక రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంది.

ఒకే సంస్థ నుంచి, ఒకే ఏడాదిలో నాలుగు భారీ సినిమాలు విడుదలవడం వల్ల, ఒకదాని బిజినెస్‌పై మరొకటి ప్రభావం చూపే ప్రమాదం ఉంది. థియేటర్ల పంపకాల దగ్గర నుంచి, ప్రమోషన్ల వరకు ప్రతీ విషయంలో గట్టి పోటీ ఉంటుంది. ఏ ఒక్క సినిమా తేడా కొట్టినా, దాని ప్రభావం మొత్తం లైనప్‌పై పడుతుంది. వెయ్యి కోట్ల పెట్టుబడిని తిరిగి రాబట్టాలంటే, ఈ నాలుగు సినిమాలలో కనీసం మూడు భారీ బ్లాక్‌బస్టర్లుగా నిలవాలి.

అయితే, మైత్రీ సంస్థ కేవలం హీరోల ఇమేజ్‌పైనే ఆధారపడటం లేదు. ‘పెద్దికి బుచ్చిబాబు, ‘ఉస్తాద్కు హరీష్ శంకర్, ‘ఫౌజీకి హను రాఘవపూడి, ‘డ్రాగన్కు ప్రశాంత్ నీల్.. ఇలా ప్రతీ సినిమాకు కంటెంట్ పరంగా బలమైన దర్శకులను ఎంచుకున్నారు. ఈ దర్శకుల ట్రాక్ రికార్డ్, వారి మేకింగ్ స్టైల్ ఈ ప్రాజెక్టులకు అతిపెద్ద బలం అని చెప్పవచ్చు. మొత్తం మీద, 2026లో మైత్రీ మూవీ మేకర్స్ ఒక పెద్ద సాహసానికే తెరలేపింది. మరి ఈ వెయ్యి కోట్ల పెట్టుబడితో మేకర్స్ ఏ స్థాయిలో లాభాలు అందుకుంటారో చూడాలి.

శ్రీలీల దీపావళి సరదాలు తెలుసా? పండగ గురించి మెసేజ్‌ కూడా అదుర్స్‌

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus