ప్రేమ కథా చిత్రాలకు అక్కినేని ఫ్యామిలీ పెట్టింది పేరు. తమ సినిమాల్లో ప్రేమకు కులం, మతం అడ్డుకాదని చూపించారు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోను ప్రేమను గౌరవిస్తామని అక్కినేని నాగార్జున చాటారు. తన పెద్ద కొడుకు నాగ చైతన్య వేరే మతానికి చెందిన అమ్మాయి సమంతను ప్రేమిస్తున్నానని చెప్పగానే ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకున్నారు. వారిద్దరికీ పెద్దల సమక్షంలో నిన్న వైభవంగా నిశ్చితార్ధం నిర్వహించారు. మగపెళ్ళివారము అని బెట్టుచేయకుండా.. సమంత కుటుంబసభ్యుల కోరిక మేరకు మొదట క్రైస్తవ సంప్రదాయ ప్రకారం చర్చ్ ఫాదర్ ఆశీస్సులతో ఎంగేజ్మెంట్ జరిపించారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్ధం నిర్వహించారు.
బొట్టు పెట్టించుకుని సమంత హోమం చేయడం విశేషం. ఇలా ఇరు కుటుంబసభ్యుల మధ్య అవగాహనతో సాగిన ఈ వేడుక గురించి అతిథులు గొప్పగా చెప్పుకుంటున్నారు. అక్కినేని నాగార్జునను అభినందనలతో ముంచెత్తుతున్నారు. త్వరలో జరగనున్న ఈ పెళ్లి కూడా రెండు మతాల ప్రకారం జరగనుంది. మొదట చర్చిలో యేసుప్రభువు ముందు సమంత, చైతూ ఆలుమగలు కాగా, అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం భార్య భర్తలు కానున్నారు. ఈ రెండు పెళ్లిళ్లకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. అనంతరం జరిగే రిసెప్షన్ కి మాత్రం అందరికీ ఆహ్వానం ఉంటుందని తెలిసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.