అక్కినేని ఇంట అఖిల్ పెళ్లి పనులు ఊపందుకోగానే, నాగ చైతన్య నిశ్చితార్థం కోసం ముహూర్తం ఫిక్స్ చేశారు. కింగ్ నాగార్జున చిన్న కుమారుడు ఎంగేజ్మెంట్ ఈనెల 9 న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే నెల పెళ్లిని యూరప్ లో నిర్వహించనున్నారు. ఆ వేడుక ముగిసిన వెంటనే నాగచైతన్య, సమంత ల నిశ్చితార్థం జరిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 29న ప్రేమ పక్షుల నిశ్చితార్థం ఘనంగా నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది.
ఆ వేడుకలోనే పెళ్లి ముహూర్తం ఖరారు చేయనున్నారు. మొదట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించనున్నారు. అనంతరం చర్చిలో మరో మారు జీసస్ ఎదుట ఉంగరాలు మార్చుకోనున్నారు. కొంతకాలం క్రితం పెళ్లిమాట ఎత్తితే ఇంకా అందుకు టైమ్ కావాలని కోరిన ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి సై అనడంతో అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు, అభిమానులు ఆనందంలో ఉన్నారు. ప్రస్తుతం నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నారు. సమంత వచ్చే ఏడాది పెళ్లి చేసుకున్నప్పటికీ ఐదు సినిమాల్లో నటిస్తానని ప్రకటించింది. ఆ చిత్రాల వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.