చివరి ఫొటోతో తండ్రిని గుర్తు చేసుకున్న నాగార్జున

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక కాలం నటుడిగా కొనసాగిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. తన చివరి శ్వాసవరకు నటిస్తూనే ఉన్నారు. ఆఖరికి క్యాన్సర్ కోరల్లో చిక్కుకొని ప్రాణం పోతున్న సమయంలోను కెమెరా ముందుకు వచ్చి నటించారు.. నవ్వించారు. అంతటి మహానటుడు ఈ లోకం విడిచి వెళ్లి అప్పుడే నాలుగేళ్లు అయిపోయింది. క్యాన్సర్ తో కొన్నేళ్లు పోరాడి ఏఎన్నార్ 2014 జనవరి 22న తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భాన్ని ఆయన తనయుడు అక్కినేని నాగార్జున గుర్తు చేసుకున్నారు. తాను చివరిసారిగా తీసిన తన తండ్రి ఫొటోను ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

“మీరు మమ్మల్ని వదిలి వెళ్లి నాలుగేళ్లు కావొస్తోంది. ఇప్పుడు మేం చేయగలిగేది మిమ్మల్ని గుర్తుచేసుకొని నవ్వుకోవడమే. సెల్ ఫోన్‌లో నేను ఆఖరిగా తీసిన నాన్న ఫొటో ఇదే’”అని నాగ్‌ ట్వీట్‌ చేశారు. ‘మనం’ సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున ఈ ఫొటో తీశారు. నాగేశ్వరరావు చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఫొటో సోషల్ మీడియాలో లైక్లు, షేర్లు అందుకుంటోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు తన కొడుకు, మనవళ్ళతో నటించి తన సినీ కెరీర్ కి సూపర్ ఎండింగ్ ఇచ్చారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus