నాగ్ చాలా తెలివిగా హ్యాండిచ్చాడు..!

నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం 2016 సంక్రాంతికి విడుదలయ్యి బాక్సాఫీస్ ను షాక్ చేసింది. పక్కన ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల చిత్రాలు ఉన్నా… ప్రేక్షకులు మాత్రం నాగార్జున చిత్రానికే ఓటేశారు. ఆ చిత్రంలో బంగార్రాజుగా నాగ్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అలాంటిది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ ను ఇప్పటికే నాగ్ ఓకే చేసాడు. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై నాగార్జునే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి.

నటీనటులను ప్రక్రియను కూడా పూర్తి చేసారు. ఇక సెట్స్ పైకి వెళ్ళడమే లేట్ అనుకునే తరుణంలో నాగార్జున డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకి షాకిచ్చాడు. విషయం ఏమిటంటే ‘మన్మథుడు 2’ చిత్రం పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ను మొదలుపెడదాం అని నాగార్జున డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకు చెప్పాడట. ఇప్పుడు ‘మన్మథుడు 2’ కూడా పూర్తయింది. ఆగష్టు 9 న విడుదల కాబోతుంది. అయితే ‘బిగ్ బాస్’ షో కి హోస్ట్ చేయబోతుండడం వలన ‘బంగార్రాజు’ చిత్రాన్ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టాలని నాగ్ భావించాడట. అయితే ‘బిగ్ బాస్3’ ఎలాగూ శని, ఆదివారాలు మాత్రమే కదా.. మిగిలిన రోజులు షూటింగ్ చేద్దామని నాగార్జునని ఒప్పించే ప్రయత్నం చేసాడట కళ్యాణ్ కృష్ణ. మొదట సరే అని చెప్పిన నాగ్.. స్క్రిప్ట్ అనుకున్న స్థాయిలో రాలేదని సరిగ్గా డెవలప్ చేయమని చెప్పి.. ‘బిగ్ బాస్3’ పూర్తయ్యే వరకూ టైం తీసుకోమని కళ్యాణ్ కృష్ణకి చెప్పి తెలివిగా హ్యాండిచ్చాడట నాగార్జున. అందుకే 2020 సంక్రాంతికి తీసుకురావాలని అనుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కి మార్చారని తెలుస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus