పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీయార్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల తర్వాత మంచి మార్కెట్ తోపాటు విశేషమైన క్రేజ్ ఉన్న కథానాయకుడు నాని. అయితే.. ఈమధ్య నాని కాస్త తడబడ్డాడు. “కృష్ణగాడి వీరప్రేమగాధ” పర్లేదు కానీ.. ఆ తర్వాత వచ్చిన “జెంటిల్ మెన్, మజ్ను” చిత్రాలు యావరేజ్ లుగా మిగిలిపోయాయి. “మజ్ను” అయితే ఆ టైమ్ లో వేరే సినిమాల్లేక బతికిబట్టగట్టింది గానీ వేరే ఏదైనా మంచి సినిమా అదే టైమ్ కి రిలీజ్ అయ్యుంటే.. పరిస్థితి వేరేలా ఉండేది. ఆ సినిమా తర్వాత నాని కూడా స్పీడ్ తగ్గించాడు. అప్పటివరకూ ఏడాదికి మూడు సినిమాల చప్పున రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన నాని ఒక్కసారిగా ఎటెన్షన్ లోకి వచ్చేశాడు. అందుకే ఈనెలాఖరుకు విడుదల కావాల్సిన “నేను లోకల్”ను కూడా పట్టు పట్టి వాయిదా వేయించాడు.
త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన “నేను లోకల్” చిత్రానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అయినప్పటికీ.. దిల్ రాజు సపోర్ట్ చేస్తూ విడుదల చేస్తున్నాడు. ఇప్పటివరకూ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు మాత్రమే పరిమితమైన నానిని మాస్ ఆడియన్స్ కు కూడా దగ్గర చేసేలా తెరకెక్కిన ఈ చిత్రంపై నానికి భారీ ఆశలు ఉన్నాయి. అసలే జనాలు “చిల్లర” లేక నానా కష్టాలు పడుతున్న తరుణంలో కంగారుగా తన సినిమాను విడుదల చేసుకొని, లేనిపోని కష్టాలు కొనితెచ్చుకోవడం అవసరమా అని ఆలోచించి.. ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయిన “నేను లోకల్” చిత్రాన్ని ఏకంగా ఫిబ్రవరికి వాయిదా వేసేశాడు. జనవరిలో ఎలాగూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి బడా హీరోలందరూ తమ సినిమాలతో బాక్సాఫీస్ మీద దాడి చేసేందుకు రెడీ అయిపోయారు కాబట్టి హ్యాపీగా ఫిబ్రవరి వరకూ వెయిట్ చేస్తే సరిపోతుందని భావించి, ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో సినిమాను విడుదల చేయించడానికి ప్లాన్ చేసుకొంటున్నాడు. మరి నాని ఆడుతున్న ఈ సేఫ్ గేమ్ ఎంతవరకూ సత్ఫలితాన్నిస్తుందో చూడాలి!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.