టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని (Nani) , తాజా ప్రాజెక్టుల విషయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. దసరా (Dasara), హాయ్ నాన్న (Hi Nanna), సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) వంటి విజయాల తర్వాత, నాని తన సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అయితే, కొన్ని ప్రాజెక్టులు ముందుకు వెళ్లకపోవడంతో ఆయన లైనప్ లో చిన్న బ్రేక్ ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాని పూర్తి చేసిన హిట్ 3 (HIT3) సినిమా మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.
అలాగే, గతంలో ప్రకటించిన ది ప్యారడైజ్ (The Paradise) మూవీ కోసం భారీ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ, ఇప్పటివరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. దీంతో, మరో ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే వరకు నాని తన తదుపరి చిత్రాలపై స్పష్టత రానట్టుగా ఉంది. ఇటీవల తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో (Cibi Chakaravarthi) నాని ఒక భారీ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు.
కానీ, సిబి చక్రవర్తి గతంలో తమిళ నిర్మాతల నుండి తీసుకున్న అడ్వాన్సులు, కొత్త సినిమా ఆలస్యం కావడం వల్ల ఆ డీల్స్ క్లియర్ చేయాల్సిన అవసరం వచ్చింది. దీంతో, ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయినట్లు సమాచారం. ఇంతకుముందు నాని సుజిత్ సినిమా బడ్జెట్ కారణాల వలన నిర్మాత డ్రాప్ అవ్వడంతో ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. ఈ బ్రేక్ లో నాని కొత్త కథలు వింటూ, తన తదుపరి సినిమాను దృఢంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
హిట్ 3 ప్రమోషన్స్, అలాగే తన బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్ నిర్మిస్తున్న కోర్ట్ (Court) మూవీపై ఫోకస్ పెట్టే అవకాశముంది. మరి, నాని తన తదుపరి సినిమాను ఎప్పుడు అనౌన్స్ చేస్తాడన్నది వేచి చూడాల్సిందే. ఈ బ్రేక్ నానికి తాత్కాలికమైనదే అయినా, అభిమానులు మాత్రం త్వరలోనే మరిన్ని క్రేజీ అప్‌డేట్స్ వచ్చేలా ఎదురు చూస్తున్నారు. నాని కొత్త సినిమాలకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.