నన్ను దోచుకుందువటే

నటుడు, కథానాయకుడు సుధీర్ బాబు నిర్మాతగా కొత్త కెరీర్ ను ఆరంభించి నిర్మిస్తూ నటించిన చిత్రం “నన్ను దోచుకుందువటే”. ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా కన్నడ కథానాయకి నభ నటేష్ కూడా తెలుగు తెరకు పరిచయమైంది. టీజర్స్ & ట్రైలర్స్ తో ఓ మోస్తరుగా ఆకట్టుకొన్న ఈ చిత్రం సినిమాగా ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!!

కథ : చిన్నప్పుడే తల్లిని కోల్పోయి.. తర్వాత చదువు మొత్తం హాస్టల్ లో సాగడం వల్ల పెద్దగా హ్యూమన్ ఎమోషన్స్ కి వేల్యూ ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ కనీసం పక్క అపార్ట్ మెంట్ లో వాళ్ళని కూడా పట్టించుకోకుండా బ్రతికేస్తుంటాడు కార్తీక్ (సుధీర్ బాబు). పెళ్లి విషయంలో జరిగిన చిన్న కన్ఫ్యూజన్ కారణంగా మేఘన (నభ నటేష్) అనే అమ్మాయిని కొన్నిరోజులపాటు తన గర్ల్ ఫ్రెండ్ సిరి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటించడం కోసం సెట్ చేసుకొంటాడు.

కానీ.. ఈ అబద్ధపు ప్రయాణంలో ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ పుడుతుంది. కానీ.. కొన్ని సందర్భాలు సహకరించకపోవడంతో ఆ ప్రేమను ఒకరితో ఒకరు వ్యక్తపరచలేకపోతారు. ఈ ప్రయాణం ఎక్కడివరకూ సాగింది అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు : సుధీర్ బాబు నటుడిగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణం చేసి విజయతీరాన్ని చేరుకొన్నాడనే చెప్పొచ్చు. ఎమోషన్స్ & కామెడీని బాగా వర్కవుట్ చేశాడు. ముఖ్యంగా ప్రపోజల్ సీన్ లో సుధీర్ బాబు పెర్ఫార్మెన్స్ కి థియేటర్ లో నవ్వకుండా ఎవరూ ఉండలేరు. సినిమాకి ఆ ఎపిసోడ్ మొత్తం హైలైట్ గా నిలుస్తుంది.

నభ నటేష్ కి కెమెరా కొత్త కాకపోవడం, తెలుగు డైలాగ్స్ కోసం తెలుగు నేర్చుకోవడంతో ఆమె నటన చాలావరకు సహజంగా అనిపిస్తుంది. ఆమె ఎనర్జీ లెవల్స్ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సరిగ్గా కాన్సన్ ట్రేట్ చేస్తే అమ్మాయి తెలుగులో మంచి హీరోయిన్ గా నిలదొక్కుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. నాజర్ తండ్రి పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా.. వర్షిణి, పృధ్వీ, నల్ల వేణు తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : అజనీష్ లోక్నాధ్ సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది. పాటల్లో ఒకట్రెండు పర్వాలేదనిపించేలా ఉన్నా.. నేపధ్యం సంగీతం మాత్రం సన్నివేశానికి తగ్గ ఎమోషన్ ను చక్కగా ఎలివేట్ చేసింది.
సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ బడ్జెట్ తగిన అవుట్ పుట్ వచ్చింది. విశేషంగా ఆకట్టుకొనే ఫ్రేమింగ్స్ ఏమీ లేకపోయినా.. సినిమాలోని ఎమోషన్ ను మాత్రం ఎక్కడా మిస్ అవ్వనివ్వలేదు. సుధీర్ బాబు నిర్మాణం విషయంలో ఎక్కడా పెద్దగా రాజీపడినట్లుగా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే కథకు అవసరమైనదానికంటే కాస్త ఎక్కువగానే ఖర్చు చేశారు అనిపించింది.

దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు రాసుకొన్న కథ కంటే ఆ కథను నడిపించిన విధానం బాగుంది. కొన్ని సన్నివేశాలను బాగా రాసుకోన్నాడు. ముఖ్యంగా హీరో-ఫాదర్, హీరోయిన్-మదర్ నడుమ వచ్చే సెంటిమెంటల్ సీన్స్ ను బాగా కన్సీవ్ చేసుకొన్నాడు. అయితే.. చాలా సన్నివేశాలను సినిమాటిక్ గా కాకుండా ఇంకా షార్ట్ ఫిలిమ్స్ తరహాలోనే డీల్ చేశాడు. అదొక్కటే కాస్త మైనస్ అనిపించింది. అలాగే.. సెకండాఫ్ లో ఎమోషన్స్ ను పండించడం కోసం స్క్రీన్ ప్లేను అనవసరంగా సాగదీసిన భావన కలుగుతుంది. ఒక దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలో ఆర్.ఎస్.నాయుడు పాసయ్యాడు కానీ.. ప్రెజంట్ ట్రెండ్ ఆడియన్స్ కి నచ్చే సినిమాలు అందించాలంటే ఇంకాస్త లాజికల్ గా, సెన్సిబుల్ గా ఆలోచించాలి. సెకండ్ సినిమాకి ఆ ఆలోచనాధోరణి ఆర్.ఎస్.నాయుడికి ఒరవడుతుందని ఆశిద్దాం.

విశ్లేషణ : ఈ సినిమా మీద ఎవరికీ ఎక్స్ పెక్టేషన్స్ అనేవి లేకపోవడం పెద్ద ప్లస్ పాయింట్. అందువల్ల యావరేజ్ సినిమాగా ఈ చిత్రం ఆల్మోస్ట్ 70% ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. నభ నటేష్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ & ఆర్.ఎస్.నాయుడు సెన్సాఫ్ హ్యూమర్ కోసం ఈ సినిమాని సరదాగా ఒకసారి హ్యాపీగా చూడొచ్చు.

రేటింగ్ : 2.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus