ఇటీవల “జ్యో అచ్యుతానంద” చిత్రంతో ఓ మోస్తరు విజయం సొంతం చేసుకొని వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న తన కెరీర్ కు కాస్త ఊరటనిచ్చిన నారా రోహిత్ మరో వెరైటీ స్టోరీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతకుమునుపు నారా రోహిత్ హీరోగా “సావిత్రి” చిత్రాన్ని తెరకెక్కించిన పవన్ సాధినేని దర్శకత్వంలో రోహిత్ మరోమారు నటించనున్నాడట. “సావిత్రి” విడుదల అనంతరం ఓ ఆరు నెలల గ్యాప్ తీసుకొన్న పవన్ ఎంతో కష్టపడి ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఓ హారర్ స్టోరీని సిద్ధం చేసుకొన్నాడు.
ఇదివరకు తాను దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు జోనర్ లు వేరే అయినా లవ్ స్టోరీసే కావడంతో.. దర్శకుడిగా తనదైన మార్క్ ను ఇండస్ట్రీలో వెయ్యాలంటే ఓ డిఫరెంట్ సినిమాను డైరెక్ట్ చేయాలని ఫిక్సయ్యాడు సాదినేని. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే.. హారర్ సినిమా కదా అని “చీకటి, రాత్రి” లాంటి రెగ్యులర్ టైటిల్స్ కాకుండా “భీముడు” అనే వైవిధ్యమైన టైటిల్ ను పెట్టాడట. మరి “భీముడు” నవ్విస్తాడా? భయపెడతాడా? లేక నవ్విస్తూ భయపెడతాడా? అనేది సినిమా సెట్స్ మీదకు వెళ్ళే వరకూ తెలియదు.