సోషల్ మీడియా వల్ల ఈ జనరేషన్ సినిమాని ఎంజాయ్ చేయలేకపోతున్నారు : నాని

“నన్ను నేను సక్సెస్ ఫుల్ స్టార్ అని ఎప్పుడూ అనుకోను.. ప్రతి సినిమాతో నటుడిగా పరిణితి చెందాలనుకుంటాను.. ఆ విధంగా కష్టపడతాను, స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకుంటాను. అంతే తప్ప ఫలానా టైమ్ లో ఫలానా సినిమానే చేయాలని ఫిక్స్ అవ్వడం లాంటివి ఏమీ ఉండవు. కమర్షియల్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి “జెర్సీ” లాంటి ఎమోషనల్ సినిమా చేయలేదు. ఆ కథ నా దగ్గరకి అప్పుడే వచ్చింది, నచ్చింది చేశాను. నా కెరీర్ లో మోర్ దేన్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను “జెర్సీ” విషయంలో” అంటూ చాలా సంతోషంగా “జెర్సీ” ప్రమోషన్స్ లో పాలుపంచుకొన్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సందర్భంగా మీడియాతో పంచుకున్న విషయాలు-విశేషాలు మీకోసం..!!

డైరెక్టర్ గౌతమ్ పాపం చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు..
గౌతమ్ మునుపటి సినిమా “మళ్ళీ రావా” నేను చూడలేదు. కానీ ఆ సినిమా గురించి చాలా మంచి విషయాలు విన్నాను. గౌతమ్ కథ చెబుతున్నప్పుడు అతని సెన్సిబిలిటీస్ & సింప్లిసిటీ చాలా నచ్చాయి. కథ మొత్తం నేరేట్ చేసిన తర్వాత “నచ్చింది.. చేద్దాం” అని అన్నాను. అయితే.. నేను అంత ఈజీగా ఒప్పుకుంటానని అనుకోలేదో లేక మరో కారణమో తెలియదు కానీ.. నేను ఒప్పుకున్నానా లేదా అనే కన్ఫ్యూజన్ మాత్రం ఉండిపోయింది అతనికి. నేను ప్రొడ్యూసర్ కి కాల్ చేసి చెప్పాను. కథ నచ్చింది సినిమా చేస్తున్నాం అని. అప్పుడు ప్రొడ్యూసర్ గౌతమ్ కి చెప్తే.. గౌతమ్ మళ్ళీ నాకు మెసేజ్ చేశాడు.. “సార్ నా ఫ్రెండ్స్ కి చెప్పుకోవచ్చా నానితో సినిమా చేస్తున్నానని” అంటూ. నేను వెంటనే రిప్లై ఇచ్చాను “హ్యాపీగా” అని. అప్పటివరకూ పాపం గౌతమ్ తెగ టెన్షన్ పడ్డాడట.

నేను మా స్కూల్లో ఎగస్ట్రా ప్లేయర్ ని..
నేను గల్లీ క్రికెట్ బాగా ఆడేవాడ్ని. ఆ తర్వాత స్కూల్లో నేను ఎక్స్ట్రా ప్లేయర్ ని. టీం లో అందరూ అవుట్ అయిపోతే బాగుండు, నాకు బ్యాటింగ్ ఛాన్స్ వస్తుంది అనుకునేవాడ్ని. కానీ.. “జెర్సీ” తర్వాత క్రికెట్ గురించి పూర్తిస్థాయి అవగాహన వచ్చింది. ఇప్పుడు టీవీలో ఏదైనా మ్యాచ్ వస్తుంటే చూస్తూ ఉండిపోతున్నాను.

తండ్రీకొడుకుల రిలేషన్ ది బెస్ట్ ఇన్ జెర్సీ.
జెర్సీ సినిమా కథలో నాకు బాగా నచ్చిన అంశం తండ్రీ-కొడుకుల మధ్య బాండింగ్. ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమాలో రోనిత్ అనే కుర్రాడు నా కొడుకు పాత్రలో నటించాడు. వాడెంత ఎనర్జీటిక్ అంటే సెట్ లో మేమందరం నైట్ షూట్స్ వల్ల నీరసపడిపోయినా.. వాడు మాత్రం ఎగురుతూనే ఉంటాడు. వాడ్ని చూసే మేం మళ్ళీ ఎనర్జీటిక్ గా మారేవాళ్లం. నేను రియల్ లైఫ్ లోను తండ్రిని కావడం వలన చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను సినిమా విషయంలో.

శ్రద్ధాశ్రీనాథ్ లాంటి అద్భుతమైన నటిని నేను చూడలేదు..
శ్రద్ధా శ్రీనాథ్ ని నేను తమిళ చిత్రం “విక్రమ్ వేదా”లోని “యాంజీ” అనే వీడియో సాంగ్ చూసాను. అరే అమ్మాయి చాలా రియాలిస్టిక్ గా ఉంది అనుకున్నాను. గౌతమ్ సారా అనే పాత్రకు ఆమె బాగుంటుంది అని చెప్పినప్పుడు సరేనన్నాను. ఆన్ ది స్క్రీన్ ఆమె పండించిన హావభావాలు, కొన్ని సన్నివేశాల్లో ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ లోని డెప్త్ చూసి గౌతమ్, నేను షాక్ అయ్యాము. సారా క్యారెక్టర్ లో శ్రద్ధను తప్ప ఎవర్నీ ఉహించుకోలేం.

సత్యరాజ్ గారు కట్టప్ప కంటే లోయల్ యాక్టర్
బాహుబలి సినిమాలో కట్టప్ప అనే క్యారెక్టర్ మాహిష్మతి అనే సామ్రాజ్యానికి ఎలా అయితే లోయల్ గా ఉంటాడో.. అంతకుమించి సినిమాకి లోయల్ గా ఉంటారు సత్యరాజ్ గారు. ఒకరోజు చిన్న షూటింగ్ కోసం ఆయన మధురై నుంచి హైద్రాబాద్ వచ్చిన తర్వాత షూటింగ్ క్యాన్సిల్ అంటే ఆయన మారు మాట్లాడకుండా క్యారీ వ్యాన్ లోకి వెళ్ళిపోయారు. నేను పర్సనల్ గా సారీ చెబుదామని వెళ్తే కూడా ఆయన అయ్యో ఏం పర్లేదు అని నవ్వేసి వెళ్ళిపోయారు.

మజిలీతో పోలిక లేదు, అలాగే ఆయన బయోపిక్ కూడా కాదు..
ఈ సినిమా “లాంబా” అనే క్రికెటర్ జీవితం ఆధారంగా రూపొందిందని, బయోపిక్ అనీ రకరకాల రూమర్స్ వస్తున్నాయి. వాటిలో ఏమాత్రం నిజం లేదు. అలాగే.. రీసెంట్ గా రిలీజైన “మజిలీ” సినిమాతో జెర్సీని కంపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెబుతున్నాను అనేది సినిమా చూశాక అందరికీ అర్ధమవుతుంది.

కాన్సెప్ట్ బాగుంటే సరిపోదు.. కథనం ఇంపార్టెంట్
నా దగ్గరకు వచ్చిన ప్రతి కథలో ముందు నేను సరిపోతానా అని చూసుకుంటాను. ఆ తర్వాత ఆ ఐడియాని దర్శకుడు ఎంత కన్విన్సింగ్ గా వివరించాడు అనేది మాత్రమే చూస్తాను. ఇప్పటివరకూ ఆ పద్ధతినే ఫాలో అయ్యాను.. ఇకపై కూడా అదే పద్ధతిని కంటిన్యూ చేస్తాను. అంతే కానీ.. కమర్షియల్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి ఎమోషనల్ మూవీస్ చేద్దామనుకోవడం, అవి పోతే కమర్షియల్ సినిమా చేద్దామనుకోవడం లాంటివి ఏమీ లేవు.

అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవరికీ తెలియలేదు..
తొమ్మిదేళ్ల క్రితం “భీమిలి కబడ్డీ జట్టు” సినిమా టైమ్ లో కూడా నాకు చాలా దెబ్బలు తగిలాయి. కాకపోతే.. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవరికీ తెలియలేదు. కానీ.. ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి చిన్న విషయం కూడా బాగా హైలైట్ అవుతుంది.

కొంచెం ఎగ్జైట్ అయ్యేలోపు కృష్ణార్జున యుద్ధంతో గాలి తీసేశారు..
నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు, ఏకంగా 7 హిట్స్ కొట్టేశాడు అని కొందరు పొగుడుతున్న టైమ్ లోనే “కృష్ణార్జున యుద్ధం” వచ్చింది. ఆ సినిమా రిలీజ్ తర్వాత గాలి మొత్తం తీసేశారు. సో, అప్పట్నుంచి ఈ పొగడ్తలు, స్టార్ డమ్ లు అనేవి పట్టించుకోవడం మానేశాను. అలాగే నా మీద వచ్చే రూమర్స్ కూడా పట్టించుకోవడం మానేశారు. అవి రాయడం వాళ్ళ ధర్మం, వాటిని ఇగ్నోర్ చేయడం నా ధర్మం అని ఫిక్స్ అయిపోయాను.

అవి ప్రొడ్యూస్ చేయాలని ఉంది కానీ..
నిర్మాణ రంగంలోకి దిగిన తర్వాత వెంట వెంటనే సినిమాలు తీసేయాలని నాకేం కంగారు లేదు. మంచి సినిమాలు తీయాలన్నదే నా ధ్యేయం. సో, ప్రెజంట్ ట్రెండ్ లో వెబ్ సిరీస్ కంటెంట్ కి మంచి మార్కెట్ & క్రేజ్ ఉంది. తప్పకుండా మంచి వెబ్ సిరీస్ ఏదైనా ప్రొడ్యూస్ చేయాలన్న ఆలోచన ఉంది కానీ.. ప్రస్తుతానికి నా దగ్గర అలాంటి కథలేమీ లేవు.

బిగ్ బాస్ అనేది నా లైఫ్ లో నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్..
బిగ్ బాస్ షో ద్వారా నేను ఎంతమందికి పరిచయమయ్యానో తెలియదు కానీ.. ప్రపంచాన్ని నాకు పరిచయం చేసిన ఘనత బిగ్ బాస్ షో ది. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది, పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా వచ్చింది. కానీ.. నాకు బాగా గుర్తున్న విషయం మాత్రం చివరి ఎపిసోడ్ చూసిన చాలా మంది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా “మిస్ యూ అన్నా” అని బాధపడ్డారు.

ఇప్పుడు ఆ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఎవరికీ ఉండడం లేదు..
ఇదివరకూ ఉదయం 11 గంటల షో సినిమాకి వెళ్ళేవరకూ సినిమా ఎలా ఉంది, ఏంటీ హైలైట్స్ అనేవి తెలిసేవి కాదు. కానీ.. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని హైద్రాబాద్ లో 8.45 షో మొదలవ్వడానికి ముందే సినిమా ఎలా ఉంది, సినిమాలో హైలైట్స్ ఏంటీ, నెగిటివ్స్ ఏంటీ అనే విషయాలు తెలిసిపోతున్నాయి. అందువల్ల ఇదివరకటి ఎగ్జైట్ మెంట్ మిస్ అవుతున్నారు ఆడియన్స్.

ఈ ఏడాది మూడు సినిమాలుంటాయి..
ఈ శుక్రవారం “జెర్సీ” రిలీజ్ కి రెడీగా ఉంది. త్వరలోనే “గ్యాంగ్ లీడర్”, ఇక ఆ తర్వాత ఏడాది చివర్లో ఇంద్రగంటి సినిమా రిలీజవుతుంది. సో ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇలా వరుసబెట్టి సినిమాలు చేస్తుండడం వల్ల కాస్తంత అలసటగా ఉంటుంది కానీ.. పని ఇంపార్టెంట్ కదా.

బెటర్ టైటిల్ చెబితే.. రిలీజ్ తర్వాత కూడా మార్చడానికి నేను రెడీ..
గ్యాంగ్ లీడర్ టైటిల్ విషయంలో జరుగుతున్న కాంట్రవర్సీలు నా వరకూ రాలేదు కానీ.. ఈ సినిమాకి ఆ టైటిల్ ఎందుకు అని అడిగితే మాత్రం నా దగ్గర మంచి సమాధానం ఉంది. అదేంటంటే.. “సినిమా రిలీజయ్యాక చూసి.. ఆ కథకి అంతకంటే బెటర్ టైటిల్ ఎవరైనా చెబితే గనుక.. రిలీజ్ తర్వాత కూడా టైటిల్ మార్చడానికి నేను రెడీ”. ఇక మీ ఇష్టం.

 – Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus