తన డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ (Dhanush) కోట్ల రూపాయలు అడిగాడంటూ గత కొన్ని రోజులుగా ఇండియన్ సినిమా మీడియాలో నయనతార (Nayantara) పేరు నానుతూనే ఉంది. ఏదో విధంగా ఆమె గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడు ఆమె గురించి ప్రస్తావనలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఆమె చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు మళ్లీ వార్తల్లోకి ఆమెను తీసుకొచ్చింది. ఈ సారి ఆమె అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేసింది.
నయనతారను అభిమానులు చాలా ఏళ్లుగా లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తూ వస్తున్నారు. ఆమె సినిమాలు సాధించిన విజయాలు, ఆమె సంపాదించుకున్న ఫేమ్, సినిమాల వసూళ్లు ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు ఇచ్చేశారు. చాలా ఏళ్లుగా ఆ ట్యాగ్‌తోనే ఆమె సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే తనను లేడీ సూపర్‌స్టార్ అని పిలవొద్దు అంటూ నయనతార తాజాగా విజ్ఞప్తి చేసింది. దానికి కారణం కూడా చెప్పుకొచ్చింది.
అభిమానులు ప్రేమతో లేడీ సూపర్ స్టార్ అని పిలవడం ఆనందంగా ఉన్నా.. నయనతార పేరే నా హృదయానికి దగ్గరైంది. ఆ పేరు నటిగానే కాకుండా, వ్యక్తిగానూ నేనేంటో తెలియజేస్తోంది. నా జీవితం తెరిచిన పుస్తకం. నా సక్సెస్‌లో, కష్టంలో మీరు అండగా ఉన్నారు. మీరెంతో ప్రేమతో ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్ బిరుదుకు నేను రుణపడి ఉంటాను కానీ, నయనతార అని పిలిస్తేనే నాకు ఆనందం అనేది ఆమె వాదన.
లేడీ సూపర్‌స్టార్ లాంటి బిరుదులు వెలకట్టలేనిదని, అయితే, ఆ బిరుదువల్ల కంఫర్ట్‌గా లేని పరిస్థితి ఉంది అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆమె ప్రత్యేకంగా ఎందుకు నో చెప్పింది అనేదే ప్రశ్న. నయనతార (Nayanthara) వయసు 40 ఏళ్లు దాటినా ఇమేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న కుర్ర హీరోయిన్లకంటే నయన్‌కే ఎక్కువ రెమ్యునరేషన్ వస్తోందని సమాచారం. రీసెంట్‌గా బాలీవుడ్‌కి వెళ్లి ‘జవాన్’ (Jawan) అనే సినిమ షారుఖ్ ఖాన్‌తో (Shah Rukh Khan) చేసి మెప్పించింది కూడా.