హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చేరిన ప్రముఖ గాయని కల్పనకు (Kalpana) ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమె అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం రాత్రి ఆమెను ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. నిద్ర మాత్రలు పెద్ద మొత్తంలో తీసుకోవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం.
మరోవైపు కల్పనను పరామర్శించేందుకు పలువురు గాయనీగాయకులు మంగళవారం రాత్రి ఆసుపత్రికి వచ్చారు. వచ్చిన వారిలో సునీత, గీతా మాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు ఉనర్నారు. కల్పన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కల్పన నిజాంపేటలోని వర్టెక్స్ ప్రీ వీలేజ్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం. ఆ సమాచారాన్ని ఆయన కాలనీ సంఘం ప్రతినిధులకు చెప్పడంతో వారు పోలీసులకు చెప్పారు.
దీంతో వారొచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో కల్పనను సమీప హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచారు. కల్పన ఆత్మహత్యయత్నం పాల్పడిన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఆమె భర్త ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కల్పన భర్తను తీసుకొని ఇంటికి వెళ్ళిన పోలీసులు అక్కడ మరోసారి తనిఖీలు చేపట్టారని సమాచారం.
అయితే తాను రెండు రోజులుగా తాను ఇంట్లో లేనని, చెన్నై వెళ్లినట్లు ప్రభాకర్ తెలిపినట్లు భోగట్టా.వ్యక్తిగత జీవితంలో సమస్యల వల్ల కల్పన బలవన్మరణానికి పాల్పడ్డారా? లేక కెరీర్ పరంగా ఏమైన సమస్యలు ఉన్నాయా? లాంటి కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు అని సమాచారం. ఈ రోజు ఈ విషయంలో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.