నేల టిక్కెట్టు

రవితేజ కథానాయకుడిగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “నేల టికెట్టు”. ఆడియో ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ రావడం మినహా పెద్దగా బజ్ క్రియేట్ చేయలేని ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా “అసలు రవితేజ సినిమా రిలీజ్ అవుతుందా?” అని ఆయన అభిమానులు కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఇవాళ (మే 25) విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేని ఈ “నేల టికెట్టు” ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో లేదో చూద్దాం..!!

కథ : అనాధగా పెరిగినప్పటికీ.. చుట్టూ ఉన్న జనాలందరూ తనవాళ్లే అని భావించే “నేల టికెట్టు” కుర్రాడు రవితేజ. కోర్ట్ లో దొంగ సాక్ష్యాలు చెప్పడం అతడి వృత్తి, ఆ దొంగ సాక్ష్యం కూడా తనకు న్యాయం అనిపిస్తేనే చెబుతాడు. అలా ఒక కేస్ లో తన అనుకున్న వ్యక్తి కోసం చెప్పిన దొంగ సాక్ష్యం కారణంగా పుట్టిపెరిగిన వైజాగ్ వదిలేసి హైద్రాబాద్ చేరుకొంటాడు.

హైద్రాబాద్ లో అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే హోమ్ మినిస్టర్ ఫణీంద్ర భూపతి మనుషుల్ని కొట్టి అతడితో వైరం పెంచుకొంటాడు. తొలుత పొరపాటున కొట్టాడేమో అనుకున్న ఫణీంద్ర ఆ నేల టికెట్టుగాడ్ని పెద్దగా పట్టించుకోడు. కానీ.. ఆశ్చర్యకరంగా తాను ముఖ్యమంత్రి అవ్వడం కోసం సిద్ధం చేసుకొంటున్న పధకాన్ని కూడా నేల టికెట్టుగాడు తునాతునకలు చేయడానికి ప్రయత్నించడంతో అతడిపై కాన్సస్ ట్రేట్ చేసిన ఫణీంద్రకు భయంకరమైన నిజాలు తెలుస్తాయి. ఏమిటా నిజాలు? ఇంతకీ నేల టికెట్టుగాడు ఫణీంద్రను ఎందుకు టార్గెట్ చేస్తాడు? ఫణీంద్ర ముఖ్యమంత్రి అవ్వగలిగాడా? వంటి ప్రశ్నలకు సమాధానంగా కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రమే “నేల టికెట్టు”.

నటీనటుల పనితీరు : రవితేజ ఎనర్జీ గురించి కొత్తగా ఏం చెబుతాం. ఆయన ఎప్పట్లానే తన పాత్రకు తన ఎనర్జీ లెవల్స్, డ్యాన్స్ మూమెంట్స్, మేనరిజమ్స్ తో తన అభిమానుల్ని అలరించాడు రవితేజ. అయితే.. క్యారెక్టర్ లో కొత్తదనం, దమ్ము లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పాత్ర పండలేదు. మాళవిక రెగ్యులర్ హీరోయిన్స్ లా పాటలకు, ఒక రెండు సన్నివేశాలకు పరిమితమైపోయింది. అయితే.. అమ్మడు మాత్రం చూడ్డానికి క్యూట్ గా ఉండడంతో సరిగ్గా ప్రయత్నిస్తే మంచి హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ.. మరీ చిన్నపిల్ల కావడం వల్లనో లేక రవితేజ ముదురుగా కనిపించడం వల్లనో తెలియదు కానీ.. ఇద్దర్నీ పక్కపక్కన చూస్తే హీరోహీరోయిన్స్ అని మాత్రం అనిపించదు.

జగపతిబాబు ఇదే తరహాలో మరో అయిదారు సినిమాలు చేశాడంటే మాత్రం ఆయన విలనిజం కూడా బోర్ కొట్టేస్తుంది. ఈ విషయాన్ని ఆయన పరిగణలోకి తీసుకొని సరికొత్త క్యారెక్టరైజేషన్స్ ఎంపిక చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలీ, ప్రవీణ్, సంపత్, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, మధునందన్, శివాజీ రాజా, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, ఎల్.బి.శ్రీరామ్.. ఇలా రాసుకుంటుపోతే ఒక A4 సైజ్ పేపర్ లో రాసేంతమంది ఆర్టిస్టులున్నప్పటికీ.. ఏ ఒక్కరి పాత్రకి సరైన స్థాయి ఎస్టాబ్లిష్ మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళందరూ బ్యాగ్రౌండ్ ఆర్టిస్టులుగానే మిగిలిపోయారు.

అన్నిటికంటే ముఖ్యంగా.. సీనియర్ మోస్ట్ కమెడియన్ అయిన బ్రహ్మానందాన్ని ఏదో బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ లా వాడడం అనేది మాత్రం బాధాకరం. సినిమా మొత్తంలో ఆయనకి కనీసం సరైన డైలాగ్ అనేది లేకపోవడం గమనార్హం.

సాంకేతికవర్గం పనితీరు : ముఖేష్.జి సినిమాటోగ్రఫీ మినహా సినిమాలో చెప్పుకోదగ్గ సాంకేతిక వర్గం ఒక్కటీ లేదు. ముఖేష్ మాత్రం సినిమాలోని కంటెంట్ తో సంబంధం లేకుండా లాంగ్ షాట్స్, ఏరియల్ షాట్స్ తో ఆకట్టుకొన్నాడు. “ఫిదా” చిత్రంతో సంగీత దర్శకుడిగా విశేషమైన పేరు సంపాదించుకొన్న శక్తికాంత్ “నేల టికెట్టు”లో “ఓసారి ట్రై చెయ్” అనే పాటతో ఓ మోస్తరుగా అలరించగా.. మిగతా పాటలతో కనీస స్థాయిలో ఎంటర్ టైన్ చేయలేకపోయాడు. ఇక మనోడి బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది.

నిర్మాణ విలువలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. అసలు అంత మంది ఆర్టిస్టులు ఉన్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు సినిమాకి ఎంత బడ్జెట్ అయ్యుంటుంది అనేది. ఎడిటింగ్ సినిమాకి మైనస్ గా మారింది. ఏ సన్నివేశం తర్వాత ఏ సన్నివేశం వస్తుంది అనేది కనీసం కనెక్షన్ లేకపోవడం, సెకండాఫ్ మొత్తం గజిబిజిగీ ఉండడం అనేది సినిమాకి పెద్ద మైనస్ అనే చెప్పాలి.

ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ కళ్యాణ్ కృష్ణ గురించి చెప్పాలంటే.. మనోడు తీసిన రెండో సినిమా “రారండోయ్ వేడుక చూద్దాం” కూడా ఏదో అలా ఫ్లోలో కొట్టుకుపోయింది కానీ పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా అయితే కాదు. ఇక మూడో చిత్రమైన “నేల టికెట్టు” విషయానికొచ్చేసరికి పూర్తిగా దొరికిపోయాడు. కథ, కథనం, సన్నివేశాలు, ట్విస్టులు అన్నీ 90ల కాలంలో బాగా ఆడిన కొన్ని మాస్ మసాలా సినిమాల నుంచి లేపేసినట్లుగా ఉంటాయే కానీ.. ఎక్కడా కనీస స్థాయి కొత్తదనం అనేది కనిపించదు. ఇక ఏదో డిఫరెంట్ గా ట్రై చేద్దామనుకొని తీసిన క్లైమాక్స్ అయితే థియేటర్ల నుంచి వెళ్లిపోయే ప్రేక్షకుల సహనానికి పరీక్ష అనే చెప్పాలి.

రవితేజ లాంటి స్టార్ హీరో దొరికినప్పుడు ఆయన ముఖ్యమైన బలమైన ఎనర్జీ లెవల్స్ ను పూర్తి ష్టాయిలో వినియోగించుకొని ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలి కానీ.. పసలేని కథ-కథనాలతో సినిమా అయ్యింది అనిపించి థియేటర్లో అలరించే బాధ్యత రవితేజ మీద పడేయాలని చూస్తే ఏమవుతుందో “నేల టికెట్టు” ఒక చక్కటి ఉదాహరణ.

విశ్లేషణ : క్లైమాక్స్ లో రవితేజ విలన్ జగపతిబాబుతో ఒక డైలాగ్ చెబుతాడు.. “ఎక్కడ మొదలెట్టావ్, ఎక్కడికి వచ్చావో అర్ధమవుతుందా?” అని. సినిమా కూడా అలాగే ఉంటుంది.. ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వచ్చింది అని ప్రతి సగటు ప్రేక్షకుడు తలపట్టుకొనేలా ఉంటుంది. రవితేజకీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే తప్ప “నేల టికెట్టు” థియేటర్లో రెండున్నర గంటలపాటు కూర్చోవడం అనేది అసాధ్యం.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus