టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సినిమాలో నటిస్తున్నారు. లెజెండ్ సినిమా తరువాత బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలు హిట్ అయినా లెజెండ్ సినిమా స్థాయిలో సక్సెస్ కాలేదు. అఖండ సినిమాతో మళ్లీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని బాలకృష్ణ భావిస్తున్నారు. అఖండ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం దర్శకుడు చిత్రీకరించాల్సి ఉందని సమాచారం. క్లైమాక్స్ లో 500 మంది షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండటంతో ఈ షెడ్యూల్ వాయిదా పడిందని తెలుస్తోంది.
ఈ సినిమా తరువాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా జులై నెలలో మొదలుకానుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి 2022 సంక్రాంతి పండుగకు విడుదల చేయాలని గోపీచంద్ మలినేని భావిస్తున్నారని తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గితే మాత్రం ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి కచ్చితంగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
పల్నాటి చరిత్రకారుడి కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. క్రాక్ సినిమాతో రవితేజకు హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలకృష్ణ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది. మరోవైపు అఖండ మూవీ రిలీజ్ డేట్ మారనుందని తెలుస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో కరోనా ఉధృతి తగ్గిన తరువాత ఈ సినిమాను రిలీజ్ చేయాలని బోయపాటి శ్రీను భావిస్తున్నారని సమాచారం. ఈ సినిమా టీజర్ కు 40 మిలియన్ల వ్యూస్ రాగా సీనియర్ హీరోలలో ఈ ఫీట్ సాధించిన హీరో బాలయ్య మాత్రమే కావడం గమనార్హం.