నెక్స్ట్ ఏంటి

వరుస పరాజయాలతో కథానాయకుడిగా తన ఉనికిని కాపాడుకోవడానికి తిప్పలు పడుతున్న సందీప్ కిషన్ కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం “నెక్స్ట్ ఏంటి”. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమాతోనైనా సందీప్ మంచి హిట్ అందుకోగలిగాడా లేదా? అనేది చూద్దాం..!!

కథ:


సంజు (సందీప్ కిషన్), టామ్మీ (తమన్నా) మోడ్రన్ లవర్స్. ప్రేమలో బాధ్యత ఉండాలి అనుకునే యువతి టామ్మీ. కానీ.. ప్రేమకు నెక్స్ట్ స్టెప్ సెక్స్ అనుకునే యువకుడు సంజు. దాంతో కలిసిన కొద్ది రోజుల్లోనే విడిపోతారు. ఆ తర్వాత ఇద్దరూ వేరే వాళ్ళతో లవ్ లైఫ్ ఎంజాయ్ చేయడం మొదలెడతారు. కానీ.. టామ్మీ ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న క్రిష్ (నవదీప్) కానీ.. సంజు లవ్ & సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న రోషిణి (లారిస్సా) తమకు కరెక్ట్ కాదని తెలుసుకొని.. మళ్ళీ తమ తొలిప్రేమను వెతుక్కుంటూ వెళ్లడమే “నెక్స్ట్ ఏంటి?” కథాంశం.

నటీనటుల పనితీరు:


సందీప్ ఎనర్జీటిక్ గా ఉన్నాడు, నవదీప్ సిన్సియర్ గా నటించాడు, తమన్నా తన మునుపటి సినిమాల్లో కనిపించినంత అందంగా కనిపించకపోయినా.. నటనతో పర్వాలేదనిపించుకొంది. ఇక లారిస్సా ఉన్న కొన్ని సన్నివేశాల్లోనే సందీప్ కి వీలైనన్ని ముద్దులిచి సినిమాకి గ్లామర్ అద్దింది. వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేక్షకుల్ని అలరించే పాత్ర మాత్రం శరత్ బాబుది. మోడ్రన్ ఫాదర్ గా ఆయన క్క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. పూనమ్ కౌర్ సినిమాలో ఎందుకుందో ఆవిడకే తెలియాలి అనుకోండి. ఆమె నటన కూడా చెప్పుకోదగ్గ విధంగా లేదు.

సాంకేతికవర్గం పనితీరు:


సినిమా చూస్తున్నప్పుడు కథ-కథనం కంటే ఎక్కువగా ఆకర్షించింది మాత్రం ప్రొడక్షన్ వేల్యూస్. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ సారధ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో.. సినిమా చూస్తున్నంతసేపు ఏదో భారీ బడ్జెట్ సినిమా చూస్తున్న ఫీల్ ను కలిగిస్తుంది. ఇక “ఫనా” దర్శకుడు దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత 2004లో తాను తెరకెక్కించిన “హమ్ తుమ్” మళ్ళీ ఎందుకు తెలుగులో తీశాడో అర్ధం కాదు. సందీప్ కిషన్ అస్తమానం అడిగే “ఆ నెక్స్ట్ ఏంటీ” అనే పాయింట్ తప్ప సినిమాలో ఆకట్టుకోదగ్గ అంశం ఒక్కటి కూడా లేదు.

ఇది సరిపోదన్నట్లు.. ఆ 5 నిమిషాల సింగిల్ టేక్ డైలాగ్స్ సీన్ మరియు ఆర్టిస్టుల చేత చెప్పించిన పేజీల పేజీల డైలాగ్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడమే కాదు.. “ఎగ్జిట్ డోర్” ఎక్కడుంది అని ఒకటికి రెండుసార్లు వెతుక్కునేలా చేస్తుంది. ఈమధ్యకాలంలో నేను చూసిన డైలాగ్స్ ఎక్కువగా సినిమా ఇదేనేమో. కెమెరా వర్క్, కలరింగ్, డి.ఐ అదిరిపోయాయి. అలాగే.. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉంది. కానీ.. ఏం లాభం కథలో బలం లేకపోవడంతో సినిమా అటకెక్కింది.

విశ్లేషణ:
లవ్ స్టోరీ అంటే కేవలం కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఒకటి ఉంటే సరిపోదు.. అందుకు తగ్గ స్క్రీన్ ప్లేతోపాటు.. క్లైమాక్స్ లో సరైన సోల్యూషన్ కూడా ఉండాలి. ఇవేమీ లేకపోవడంతోపాటు సన్నివేశానికి సంబంధం లేని ప్రాసలు, అనవసరమైన ఎమోషన్స్ కలగలిపిన సంభాషణలతో “నెక్స్ట్ ఏంటీ” ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.

రేటింగ్: 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus