సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సినిమాల్లోకి రావడం గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. అయితే ప్రధాన పాత్రధారులుగా సినిమాలు చేయడం మాత్రం తక్కువే. ఈ కోవకు చెందిన అమ్మాయే నిహారిక. ఎన్‌ఎం. ఆమె ‘మిత్ర మండలి’ సినిమా ద్వారా ప్రియదర్శికి జోడీగా తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతోంది. నిజానికి ఆమె తొలి సినిమా ఇదే అవ్వాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమై.. తమిళ సినిమా ‘పెరుసు’ తొలి సినిమా అయింది. ఆ విషయం పక్కడన పెడితే ‘మిత్రమండలి’ సినిమా నెల 16న రానున్న సందర్భంగా ఆమె ఎర్లీ డేస్‌ని తలచుకుంది.
కాలేజీ రోజుల్లోనే నిహారిక యూట్యూబ్‌లో ఓ ఛానల్ పెట్టింది. టైమ్‌పాస్‌కి అప్పుడప్పుడు సరదా వీడియోలు చేసేది. రెండేళ్ల వరకు అందులో ఆదాయం రాలేదట. దాంతో ఫన్నీ వీడియోలు చేస్తే చేశావు గానీ, ఇదే కెరీర్ అన్నావంటే మాత్రం కాళ్లు విరగ్గొడతా అని ఇంట్లో అన్నారట. అయితే అప్పుడలా కాలక్షేపానికి పెట్టిన ఛానెల్ ఈరోజు ఆమెను సినిమాల వరకు తీసుకొచ్చింది. అదీ సోషల్ మీడియా పవర్ మరి.
సినిమాల్లోకి వచ్చేశారు కదా.. ఎలాంటి కథలు చేద్దాం అనుకుంటునర్నారు అని అడిగితే.. ఆసక్తికర సమాధానలు చెప్పింది. సినిమా ఇండస్ట్రీ గురించి చాలామంది చాలా రకాలు చెబుతుంటారు కానీ.. మన హద్దుల్లో మనం ఉంటే ఏమీ కాదు అనే ధైర్యం, భరోసాను కొత్తగా వచ్చేవారికి ఇచ్చింది నిహారిక. ఇక తన వరకు వస్తే వైవిధ్యభరితమైన కథలు, పాత్రలు చేయాలని ఉందని చెప్పింది. డార్క్ హ్యూమర్ చాలా ఇష్టమని.. ఏ పాత్ర చేసినా కుటుంబంతో కలసి హాయిగా చూసుకునేలా ఉండాలని అనుకుంటానని చెప్పింది.
ఇక ఆమె రాబోయే సినిమాల సంగతి చూస్తే.. అల్లరి నరేశ్ కొత్త సినిమా ‘ఆల్కహాల్’లో ఆమెనే కథానాయిక. ఆ తర్వాత తమిళంలో ‘ఇదయమ్ మురళి’ అనే సినిమా కూడా చేస్తోంది. ఇవి కాకుండా మరో సినిమా చర్చల్లో ఉందని సమాచారం.