వరుణ్ సందేశ్ (Varun Sandesh) ‘బిగ్ బాస్ 3’ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇదివరకటిలా లవ్ స్టోరీస్ మాత్రమే కాకుండా వైవిధ్యమైన చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ‘నింద’ (Nindha) తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నైజాంలో ఈ చిత్రాన్ని ‘మైత్రి’ సంస్థ రిలీజ్ చేస్తుంది. దీంతో ఈ సినిమా పై ప్రేక్షకుల దృష్టి పడింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :
కథ : కాండ్రకోట అనే ఓ ఊరు. అక్కడ మంజు(క్యూ మధు) అనే అమ్మాయి దారుణంగా హత్యకి గురవుతుంది. మంజు చనిపోయిన ప్లేస్ లో పోలీసులకి ఓ కత్తి దొరుకుతుంది. ఆ కత్తి పై ఆ ఊరికి చెందిన పెద్దాయన బాలరాజు (ఛత్రపతి శేఖర్(Chatrapathi Sekhar) వేలి ముద్రలు ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తారు పోలీసులు. దీంతో అతనికి ఉరిశిక్ష పడుతుంది. బాలరాజు కేసులో తీర్పు ఇచ్చింది సత్యానందం (తనికెళ్ల భరణి (Tanikella Bharani)). అయితే అతను తీర్పు ఇచ్చిన చివరి కేసు అది.
కానీ ఆ తర్వాత బాలరాజు ఆ తప్పు చేయలేదు అని సత్యానందంకి తెలుస్తుంది. దీంతో అతను మానసికంగా కృంగిపోతాడు.ఈ క్రమంలో అతని ఆరోగ్యం పాడవ్వడంతో అతని కొడుకు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) అధికారి అయిన వివేక్ (వరుణ్ సందేశ్) సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత బాలరాజు కేసును వివేక్ ఎందుకు టేకప్ చేయాలనుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : వరుణ్ సందేశ్ బాగానే నటించాడు. తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో తన సీనియారిటీ చూపించాడు. లుక్స్ పరంగా కూడా అప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు.సినిమా స్టార్ట్ అయిన 40 నిమిషాల వరకు అతని పాత్ర కనిపించకపోవడం కొత్తగా అనిపిస్తుంది.
తనికెళ్ళ భరణి, ‘ఛత్రపతి’ శేఖర్..ల పాత్రల చుట్టూనే కథ మొత్తం నడుస్తుంది. వాళ్ళు కూడా బాగానే నటించారు. హీరోయిన్ శ్రేయరాణి రెడ్డికి పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. లుక్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అనీ పాత్ర డిఫరెంట్ గా ఉంది. భద్రం (Bhadram), సిద్దార్థ్,సూర్య కుమార్ (Surya Kumar) భగవందాస్ ( Bhagvandas)..లు ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : ‘100 మంది దోషులు శిక్ష నుండి తప్పించుకున్నా పర్వాలేదు..కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు’ అనే థీమ్ తో ‘నింద’ ని రూపొందించాడు దర్శకుడు రాజేష్ జగన్నాథం. ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలు ఎక్కువగా మలయాళంలో రూపొందుతుంటాయి. తెలుగులో కూడా ‘నాంది’ వంటి సినిమాలు వచ్చి సక్సెస్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి. మొదటి 5 నిమిషాల్లోనే నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. కానీ ఆ తర్వాత తడబడ్డాడు.కథనం స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది.
ఇంటర్వెల్ కి కొద్దిసేపటి ముందు హీరో ఫేస్ రివీల్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఓకే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంత వేగంగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ లు ఓకే అనిపిస్తాయి. క్లైమాక్స్ లో ఇచ్చిన కన్క్లూజన్ కూడా బాగుంది. ఇలాంటి సినిమాలకి స్క్రీన్ ప్లే కాస్త వేగంగా ఉంటే బాగుంటుంది. టెక్నికల్ టీం అంతా కొత్తవాళ్ళే అయినప్పటికీ వాళ్ళ కష్టం తెరపై కనిపించింది. రన్ టైం 2 గంటలే ఉండటం ఓ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
విశ్లేషణ : ‘నింద’ మంచి లైన్ తో రూపొందిన ఓ సీరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే కచ్చితంగా దీని స్థాయి మరోలా ఉండేదేమో. టార్గెటెడ్ ఆడియన్స్ మెప్పించొచ్చు .
రేటింగ్ : 2.5/5
ఫోకస్ పాయింట్ : టార్గెటెడ్ ఆడియన్స్ కి మాత్రమే