నిన్ను కోరి

  • July 7, 2017 / 10:15 AM IST

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం “నిన్ను కోరి”. నాని సరసన నివేదా థామస్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ద్వారా శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. “సరైనోడు”తో విలన్ గా విశేషంగా ఆకట్టుకొన్న ఆది ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించాడు. మరి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : కెరీర్ లో సెటిల్ అవ్వడం కోసం ప్రేమను దూరం చేసుకొన్న యువకుడు ఉమా (నాని).  ప్రేమించిన కుర్రాడి కెరీర్ ను దృష్టిలో ఉంచుకొని.. తల్లిదండ్రుల మాట జవదాటలేక ఇష్టం లేని పెళ్లి చేసుకొన్న యువతి పల్లవి (నివేదా థామస్). తాను ఇష్టపడి పెళ్లి చేసుకొన్న అమ్మాయి.. ఆమె మునుపటి ప్రేమకథ మొత్తం చెప్పినా.. ఆమెతోపాటు ఆమె ప్రేమకథను కూడా అంగీకరించిన సహృదయుడు అరుణ్ (ఆది).  ఈ ముగ్గురి జీవితాలు చివరికి ఏ తీరానికి చేరాయి. ప్రేమ వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులను తీసుకువచ్చింది అనేది “నిన్ను కోరి” బేసిక్ థీమ్.

నటీనటుల పనితీరు : నటుడిగా నాని గురించి చెప్పడానికి కొత్తగా ఏమీ లేదు. మానసిచ్చిన అమ్మాయి ప్రేమను అంగీకరించినప్పుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యే సఫలీకృతుడిగా ఎంతటి మెచ్యూరిటీ చూపించాడో.. ప్రేమ విఫలమైనప్పుడు భగ్న ప్రేమికుడిగానూ అదే స్థాయి మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నాడు. క్లైమాక్స్ లో ఏడుపు ఆపుకుంటూ నడుచుకుంటూ వెళ్లిపోయే షాట్ ని సింగిల్ టేక్ లో ఫినిష్ చేసిన విధానం నటుడిగా అతడు సినిమా సినిమాతో ఏ స్థాయిలో ఎదుగుతున్నాడనేడానికి నిదర్శనం. అలాగే.. మరీ ఎమోషనల్ గా సాగిపోతున్న సినిమాలో తనదైన మేనరిజమ్ తో కాస్తంత కామెడీ పండించి కాసేపు ప్రేక్షకుడ్ని నవ్వించే బాధ్యతను కూడా తన భుజాలపై వేసుకొన్నాడు. ప్రతి భగ్న ప్రేమికుడు నాని పాత్రకు విశేషంగా కనెక్ట్ అయిపోయి.. అతడి తనను తాను చూసుకుంటాడు.

“జెంటిల్ మెన్” సినిమాలోనే అద్భుతమైన నటనతో విశేషంగా అలరించిన నివేదా థామస్ మరోమారు తనదైన హావభావాలతో పాత్రకి ప్రాణం పోసింది. పల్లవి పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేం. “మృగం, ఏకవీర, వైశాలి” లాంటి చిత్రాలతో ఇప్పటికే నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకొన్న ఆది పినిశెట్టి కూడా తన పాత్రకు న్యాయం చేశాడు.  మురళీశర్మ తండ్రి పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా.. పృధ్వీ సింగిల్ లైన్ పంచస్ తో కాస్త నవ్వించాడు.

సాంకేతికవర్గం పనితీరు : కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. విదేశీ అందాలతోపాటు.. స్వదేశీ లొకేషన్స్ ను కూడా చక్కగా చూపించాడు. లోలైట్ షాట్స్, నేచురల్ లైట్ ను బేస్ చేసుకొని తీసిన లాంగ్ షాట్స్ కంటికింపుగా ఉంటాయి. చాలా సన్నివేశాల్లో కేవలం కెమెరా ఫ్రేమింగ్స్ తోనే ఎమోషన్ ను చక్కగా పండించాడు. గోపీసుందర్ బీజీయమ్ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ. మెయిన్ ధీమ్ ను మలయాళ చిత్రం “బెంగుళూరు డేస్”లోని లవ్ సాంగ్ నుండి కాపీ (అది కూడా తన సినిమానే కాబట్టి కాపీ అనకూడదేమో) చేసి కొన్ని బీట్స్ మిక్స్ చేసి ఇక్కడ ప్లే కొట్టాడు. పాటలు వినసోంపుగా ఉన్నా.. తిరిగి పాడుకొనే స్థాయిలో లేవు. పైగా.. “బ్రేకప్..” మినహా పాటలన్నీ మాంటేజ్ లే కావడం వల్ల అవి కథలో కలిసిపోయాయే కానీ.. పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాయి. మామూలుగానే కాస్త తెలివిగా వ్యవహరించే కోన వెంకట్.. “నిన్ను కోరి” విషయంలో అతి తెలివి ఉపయోగించి.. బేసిక్ స్టోరీని ఎలాగో కొన్ని పాత హిందీ సినిమాలతో పోల్చే అవకాశాలున్నాయని ఒక సన్నివేశంలో సదరు సినిమా పేర్లు, క్యారెక్టర్స్ ను కూడా నటీనటులతో చెప్పించేసి ఇంకొకరు కంపేర్ చేసి పాయింట్ అవుట్ చేసే అవకాశం ఇవ్వలేదు. “దమ్ బిర్యానీ ఎవడైనా షేర్ చేసుకొంటాడు, దరిద్రాన్ని షేర్ చేసుకొనేవాడే బెస్ట్ ఫ్రెండ్” లాంటి ఫన్నీ అండ్ “ప్రేమకు పెళ్లి అవసరం లేదు, కానీ పెళ్ళికి ప్రేమ అవసరం” లాంటి ఎమోషనల్ డైలాగ్స్ తో ఆకట్టుకొన్నాడు కూడా.

ఇక దర్శకుడు శివ నిర్వాణ విషయానికి వస్తే.. విడుదలకు ముందు నాని ఇంటర్వ్యూలో చెప్పినట్లే ఈ కథ తనదో లేక తన స్నేహితుడి జీవితంలోనో చోటు చేసుకొన్నదని ఖచ్చితంగా చెప్పగలం. చాలా సింపుల్ లైన్. ఈ తరహా లైన్ తో ఇదివరకే “రాజా రాణి” వచ్చి ఘన విజయం సొంతం చేసుకొంది. అయితే.. ఆ సినిమాలో ఎమోషన్ ను దర్శకుడు అట్లీ ఆడియన్స్ ఓన్ చేసుకొనేలా తెరకెక్కించిన విధానం ప్లస్ అయ్యింది. శివ నిర్వాణ ఆ లాజిక్ ను మిస్ అయ్యాడు. ఎమోషన్ ఉంటే సరిపోదు.. ఎలివేషన్ కూడా ఉండాలి. తన ప్రేమను గెలుచుకోడానికి అవకాశం ఉన్నప్పటికీ పల్లవి కేవలం తండ్రిని ఎదిరించడం కాదు కదా అతడితో మాట్లాడలేక తెచ్చిన ఒకే ఒక్క పెళ్లి సంబంధాన్ని ఒప్పేసుకొని తల ఒంచి తాళి కట్టించుకోవడంలోనే ఎక్కడా లాజిక్ సింక్ అవ్వలేదు. అలాగే.. క్లైమాక్స్ ను ఎలా ఎండ్ చేయాలో అర్ధం కాక ఆది పాత్రకు కూడా ఒక ఒన్ సైడ్ లవ్ స్టోరీని క్రియేట్ చేయడం దర్శకుడిగా అతడి పరిపక్వతను అద్దం పడుతుంది. ఇలాంటి మెచ్యూర్డ్ లవ్ స్టోరీస్ ను 1990లోనే ఇ.వి.వి.సత్యనారాయణగారు “మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది” అనే సినిమాతో, “మౌనరాగం”తో మణిరత్నం లాంటి దర్శకులు తీసి ప్రేమకు పునాది త్యాగం అని చాలాసార్లు చెప్పారు. రీసెంట్ గా అట్లీ కూడా “రాజా రాణి”తో ప్రేమ ఫెయిల్ అయితే.. లైఫ్ ఫెయిల్ అయినట్లు కాదు అనే థీమ్ తో ప్రేక్షకుల మనసు దోచుకొన్నాడు. సో, డైరెక్టర్ అనుకొన్న కథలో ఎంత మెచ్యూరిటీ ఉందో తెలీదు కానీ.. తెరకెక్కించగా వచ్చిన ఔట్ పుట్ లో మాత్రం మెచ్యూరిటీ కనిపించదు.

విశ్లేషణ : నాని మంచి నటుడే అందులో సందేహం లేదు. కానీ.. ఎంతసేపు అతడి నటన చూసి మురిసిపోతాం చెప్పండి. కథా కొత్తది కాక.. కథనంలోనూ కొత్తదనం లేక కేవలం నటీనటుల పనితీరు చూసి సంతృప్తి చెందడం నాని అభిమానుల వల్లేమైనా అవుతుందేమో కానీ.. సగటు ప్రేక్షకులను మాత్రం “నిన్ను కోరి” ఆకట్టుకోవడం కాస్త కష్టమే.అయితే.. ఈ సమీక్షతో సంబంధ లేకుండా “దువ్వాడ జగన్నాధం” అనంతరం మరో సినిమా లేక వచ్చేవారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేక “నిన్ను కోరి” థియేటర్లలో ఆడే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

రేటింగ్ : 2.5/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus