2027 సంక్రాంతి సీజన్..ని సీనియర్ హీరోలు కబ్జా చేశారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాలు 80 శాతం సంక్రాంతి సీజన్ కి లాక్ అయిపోయాయి. సో వాళ్ళ సినిమాలు ఉండగా.. వేరే హీరోల సినిమాలకి స్పేస్ ఉంటుంది అని కచ్చితంగా చెప్పలేం. యంగ్ హీరోల సినిమాలను ఆ టైమ్లో రిలీజ్ చేయడానికి బయ్యర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారన్న గ్యారెంటీ లేదు.
పైగా సీనియర్ స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతుంటే.. ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు.90 లలో వాళ్ళ సినిమాలతో థియేటర్లు ఎలా కలకలలాడేవో గుర్తుచేస్తున్నారు. వేరే సీజన్లో ఈ స్టార్ హీరోల సినిమాలు వస్తుంటే.. పెద్దగా ఆడటం లేదు అనేది కూడా నిజం. అది కూడా అందరూ ఒప్పుకుని తీరాలి. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. సంక్రాంతి సీజన్ కి అయితే సీనియర్ స్టార్ హీరోల సినిమాలకి తిరుగులేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అయినప్పటికీ ఓ మిడ్ రేంజ్ హీరో తన నెక్స్ట్ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్ తో సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఆ హీరో మరెవరో కాదు నితిన్(Nithiin). ‘భీష్మ’ తర్వాత నితిన్ అరడజను సినిమాలు చేస్తే.. ఆ అరడజను సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల కాలంలో అతన్ని 2 క్రేజీ ప్రాజెక్టుల నుండి కూడా తప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా సీనియర్ స్టార్ హీరోల సినిమాలకి పోటీగా నెక్స్ట్ సంక్రాంతికి తన సినిమా దింపాలని చూస్తున్నాడు.
విషయంలోకి వెళ్తే.. ‘ఆయ్’ దర్శకుడు అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇది గోదావరి నేపధ్యంలో సాగే కథ. కామిడీ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయట. అందుకే ఈ సినిమాని 2027 సంక్రాంతి బరిలో దింపాలని టీమ్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ఈ సినిమాకి ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాని నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ నిర్మించనుంది.