కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుఉన్న నీరజ కోన.. దర్శకురాలిగా మారుతోంది అనే వార్త బయటకు వచ్చినప్పుడు చాలామందికి వచ్చిన డౌట్ హీరో ఎవరు? నానినా, లేక నితినా అని. ఎందుకంటే ఇండస్ట్రీలోని హీరోల్లో వారిద్దరూ నీరజకు మంచి ఫ్రెండ్స్. చాలా సినిమాలకు పని చేశారు. బయట కూడా స్నేహంగా ఉంటారు. కానీ ఆమె అనూహ్యంగా తన సినిమాను సిద్ధు జొన్నలగడ్డ హీరోగా అనౌన్స్ చేశారు. దీని వెనుక ఉన్న రీజన్ ఇప్పుడు బయటకు వచ్చింది. అఫ్‌కోర్స్ ఆమెనే ఈ మాట చెప్పింది.
నీరజ కోన స్కూల్లో చదువుకునే రోజుల్లో స్కూల్ మ్యాగజైన్‌కి కథలు, వ్యాసాలు రాసేవారట. అయితే దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు. పన్నెండేళ్లుగా సినిమాలకి స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నప్పుడు సాంకేతిక నిపుణుల్ని, వాళ్ల పనితీరుని చూశాక ఆ ఆలోచన కలిగింది. ఈ క్రమంలో నాని, నితిన్‌కి కొన్ని కథల ఆలోచనలు చెప్పారట. వాళ్లు డైరెక్షన్ చేయొచ్చు కదా అని అన్నారట. అలా ‘తెలుసు కదా’ కథను సిద్ధం చేసుకొని ‘ఎక్స్ ట్రా’ సినిమా చిత్రీకరణ టైమ్‌లో నితిన్‌కి చెప్పారట.
ఆయన కథ గురించి తెలుసుకొని ఈ సినిమా సిద్ధుకి అయితే బాగుంటుంది అని అన్నాడట. అలా స్క్రిప్ట్‌తో సిద్ధు జొన్నలగడ్డకు చెప్పారట. ఆయన ఓకే చేయడంతో ఈ సినిమా మొదలైంది అని నీరజ కోన తెలిపారు. వరుణ్, రాగ, అంజలి అనే మూడు పాత్రలతో ముడిపడిన ప్రేమకథ ఇది. పాత్రలకి తగ్గ నటులు దొరికారంటే, ప్రేమకథలు సగం విజయవంతమైనట్టే అని అంటుంటారు. ఇప్పుడు నీరజ కోన కూడా అదే మాట అన్నారు. ఇక రెండో సినిమా కూడా ప్రేమకథనే సిద్ధం చేశా అని తెలిపారు.
‘తెలుసు కదా’ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది. ఆ తర్వాతనే నీరజ కోన కొత్త సినిమా అనౌన్స్ అవుతుంది అని చెబుతున్నారు. ఆ సినిమా కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీదనే ఉంటుందని సమాచారం.