రామరాజు అనే దర్శకుడు తీసింది ఒకటే సినిమా. అదే మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు. ఆ సినిమా గొప్పగా ఏం ఉండదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం కథలా కాకుండా ఓ పొయెట్రీలా అనిపిస్తోంది. అద్భుతం అనిపించకపోయినా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే రామరాజు సినిమా అంటే క్లాస్ ఆడియన్స్ కాస్త ఇంట్రస్ట్ చూపించారు. మెగా డాటర్ నిహారిక ఉంది కాబట్టి మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచుకొన్నారు. మరి రామరాజు ఆ అంచనాల్ని రీచ్ అయ్యాడో.. లేదో.. సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..!
కథ : సూర్య (నాగశౌర్య)కి ఓ కల ఉంటుంది. రాజకీయాల్లో తనకంటూ ఓ స్థాయి తెచ్చుకోవాలని, ఎమ్మెల్యే కావాలని ఆరాటపడుతుంటాడు. అదే లక్ష్యంతో చిన్న చిన్న సెటిల్‌మెంట్స్ చేస్తుంటాడు. అదే ఊర్లో డాక్టర్‌గా పనిచేస్తున్న సంధ్య (నీహారిక) సూర్యతో ఫ్రెండ్ షిప్ చేస్తుంది. ఆ స్నేహమే ప్రేమగా మారుతుంది.ఓ సెటిల్ మెంట్ వ్యవహారంలో ఇరుక్కొన్న సూర్య చిక్కుల్లో పడతాడు. మూడేళ్లు జైల్లో ఉంటాడు. కానీ… సంధ్య మాత్రం సూర్య కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. జైలు నుంచి వచ్చిన తరువాత సూర్య, సంధ్యలు కలుసుకొన్నారా? సూర్యలో వచ్చిన మార్పేంటి? వీరిద్దకి కథ ఎన్ని మలుపులు తీసుకొంది? అనే అంశాలతో సినిమా నడుస్తుంటుంది.
నటీనటుల పెర్ఫార్మన్స్ : నాగశౌర్యకు ఈ సినిమా కమర్షియల్ గా ఏ మాత్రం ఉపయోగపడకపోవొచ్చు. కానీ నటుడిగా మాత్రం తనకు తప్పకుండా మంచి పేరు తీసుకొచ్చే సినిమా. తండ్రి ఆశయానికీ ప్రేమకూ మధ్య నలిగిపోయిన యువకుడిగా తన నటన ఆకట్టుకొంటుంది. ఇక మెగా డాటర్ నిహారిక.. చెప్పాలంటే ఈ సినిమా మొదలైనప్పటి నుంచీ ఆమె ఎలా కనిపిస్తుందో.. ఎలా నటిస్తుందో అని ఆశగా ఎదురు చూసిన మెగా ఫ్యాన్స్‌ని మరీ అంతగా నిరాశ పరచదు గానీ.. ఆమె నుంచి అద్భుతాలు ఆశించలేం. తొలి సినిమా కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడాలి. రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల ఆకట్టుకున్నారు. ప్రగతి ఒక అనిపించింది. వెన్నెల కిషోర్ కూడా పర్వాలేదనిపించారు.
సాంకేతిక వర్గం పనితీరు : సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్. వైజాగ్‌ని అద్భుతంగా చూపించాడు కెమెరామెన్. ఇప్పటికే సినిమా పాటలు, అందులోని సాహిత్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు మైనస్ పాయింట్ ఎడిటింగ్. దాని మీద శ్రద్ధ చూపించి ఉంటే సినిమా బావుండేది. స్క్రీన్ ప్లే మరీ చాదస్తంగా ఉంది. అక్కడక్కడా గందరగోళం కూడా కనిపిస్తుంది. దర్శకుడిగా రామరాజు స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇలానే ఉంటుంది. కానీ సామాన్య ప్రేక్షకుడికి మాత్రం ఈ స్లో నేరేషన్ భరించలేని విధంగా ఉంటుంది.
విశ్లేషణ : ఈ కథ చూస్తుంటే దర్శకుడు 80 లలో ఉండిపోయాడనిపిస్తుంది. దానికి తగ్గట్లే హీరో, హీరోయిన్ల డ్రెస్సింగ్ ఉంటుంది. రామరాజు అనుకున్న లైన్ బావున్నప్పటికీ దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎంతసేపు స్క్రీన్ మీద హీరో, హీరోయిన్స్ వాళ్ళు కలవడం, విడిపోవడం, మళ్లీ కలవడం, విడిపోవడం ఇలాంటి సన్నివేశాలతోనే సాగుతుంది. సంభాషణలు కూడా అలానే ఉంటాయి. ఒకసారి వింటే డైలాగ్స్ అర్ధం కావు. కాస్త లోతుగా ఆలోచిస్తే ఇంత అర్ధముందా అనిపిస్తుంది. సాధారణ ప్రేక్షకుడికి సినిమా ఆహ్లాదకరంగా ఉండాలి కానీ డైలాగ్ అర్ధం కాక ఆలోచించుకునే విధంగా ఉండకూడదు. మొదటి భాగం స్లో గా సాగుతుంది.. రెండో భాగం బావుంటుందనుకుంటే తప్పే. ఆ స్లో నేరేషన్ కాస్త ఇంకా స్లో గా ఉంటుంది. మెగా ఫ్యాన్స్ ను ఈ సినిమా నిరాశ పరచడం ఖాయం. అలా అని ఈ సినిమా ఎవరికి నచ్చదని కాదు. 80 లలో సినిమాలను ఇష్టపడే వారికి, నవలను ఎక్కువగా చదివేవారికి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
రేటింగ్ : 2/5