ఒక్కడు మిగిలాడు

మంచు మనోజ్ కథానాయకుడిగా అజయ్ ఆండ్రూస్ మరో ముఖ్యపాత్ర పోషిస్తూ తెరకెక్కించిన చిత్రం “ఒక్కడు మిగిలాడు”. మంచు మనోజ్ రెండు వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఈ చిత్రం విడుదల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొని ఎట్టకేలకు నేడు (నవంబర్ 10న) విడుదలైంది. మరి మనోజ్ పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందా లేదా అనే విషయం తెలియాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.

కథ : సూర్య (మంచు మనోజ్) ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధి. తన కాలేజ్/క్లాస్ కు చెందిన ముగ్గురు విద్యార్ధిణులను లోకల్ మినిస్టర్ కొడుకులు అత్యాచారం చేయడానికి యత్నించి వారు సహకరించకపోవడంతో చంపేస్తారు. అయితే.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తారు మినిస్టర్ తొత్తులు. ఈ విషయమై ధర్నా మొదలెడతాడు సూర్య, దాంతో డ్రగ్స్ కేసులో అతడ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో చిత్రహింసాలకు గురి చేస్తుంటారు. కట్ చేస్తే.. అదే పోలీస్ స్టేషన్ కు కొత్తగా ట్రాన్స్ ఫర్ అయ్యి వచ్చిన కానిస్టేబుల్ పోసాని కృష్ణమురళి అక్కడ సూర్య పరిస్తితి చూసి అతనికి సహాయపడతాడు. ఆ క్రమంలో తన జీవితంలో చోటు చేసుకొన్న మరో బానిస కథను చెబుతాడు సూర్య. సూర్య చెప్పే కథకి ప్రస్తుతం జరిగే పరిణామాలు ఎలా రిలేట్ అయ్యాయి అనేది “ఒక్కడు మిగిలాడు” చిత్ర కథాంశం.

నటీనటుల పనితీరు : సూర్య అనే స్టూడెంట్ పాత్రలో మంచు మనోజ్ నటుడిగా పర్లేదనిపించుకొన్నాడు కానీ.. తమిళ టైగర్ రోల్ ను మాత్రం ఆకట్టుకొనే స్థాయిలో పోషించలేకపోయాడు. ముఖ్యంగా విపరీతమైన ఇంటెన్సిటీని పండించాల్సిన సన్నివేశంలో ఏదో ఆర్.నారాయణ మూర్తిని ఇమిటేట్ చేస్తున్నట్లుగా ఊగిపోవడం సన్నివేశంలోని ఎమోషన్ ను ఎలివేట్ చేయకపోగా.. సగటు ప్రేక్షకుడు నవ్వుకొనేలా ఉంది. సినిమా కోసం బరువు పెరగడం వరకూ బాగానే ఉంది కానీ.. స్లోమోషన్ షాట్స్ లో ఆ బుగ్గలు ఊగడం చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక దర్శకుడు కమ్ కీలకపాత్రధారి అజయ్ ఆండ్రూస్ కు దర్శకత్వం వహించాలనే దృక్పధం కంటే నటించాలన్న కోరిక ఎక్కువగా ఉండడం వల్ల.. రెండు పడవల ప్రయాణంలో ఏ ఒక్క పడవనూ సరిగా నడపలేకపోయాడు.

మంచు మనోజ్ కంటే తనకే ఎక్కువ సన్నివేశాలు రాసుకొన్న అజయ్ ఆండ్రూస్ విక్టర్ పాత్రలో అటు ఇంటెన్సిటీని, ఇటు ఆక్రోశాన్ని సరిగా పండించలేక సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో ఇబ్బందిపెట్టాడు. ఇక పేరుకే హీరోయిన్ అయిన అనీషా ఆంబ్రోస్ కు లెక్కపెడితే సరిగ్గా నాలుగు సీన్లు కూడా లేవు. పోసాని కృష్ణమురళి, సుహాసిని, మురళీమోహన్ వంటి ఆర్టిస్టులు తమ తమ పాత్రలకు హుందాతనం తీసుకురావడమే కాదు న్యాయం కూడా చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : శివ నందిగామం నేపధ్య సంగీతం పర్లేదు. కానీ.. రిపీటెడ్ గా అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ కోదండ రామరాజుపై రాంగోపాల్ వర్మ ఇన్ఫ్ల్యుయన్స్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. మందు గ్లాసు కింద, గన్నుకి, తెడ్డుకి కెమెరాలు తగిలించి బాగా ఇబ్బందిపెట్టాడు. ఎడిటర్ ఒక కత్తెరను కాక రెండు కత్తెర్లు వాడినా తప్పు లేదేమో అనిపించింది. ఫస్టాఫ్ లో ల్యాగ్, సెకండాఫ్ లో లెంగ్త్ బాగా ఎక్కువయ్యాయి.

ఇక దర్శకుడు అండ్ ముఖ్యపాత్ర పోషించిన అజయ్ ఆండ్రూస్ నూతక్కి గురించి చెప్పుకోవాలి.. రెండేళ్ల క్రితం ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన తమిళ చిత్రం “రావణ దేశం”ను తెలుగులో రిలీజ్ చేయడం కోసమే అన్నట్లుగా మంచు మనోజ్ తో కొన్ని పోర్షన్స్ వరకూ షూట్ చేసి మిగతా సన్నివేశాలన్నీ దాదాపుగా తమిళంలోవే వాడేసి తెలుగు ప్రేక్షకులకి మాత్రం “అడ్వంచర్ ఆఫ్ తెలుగు సినిమా (తెలుగు సినిమా చేసిన సాహసం)” అంటూ కలరింగ్ ఇచ్చి ఇక్కడ విడుదల చేసేయడం ఎంతవరకూ సమంజసం అనేది ఆయన మనస్సాక్షికే వదిలేస్తున్నాం. సినిమాలో పోరాట స్పూర్తి లేదు, కనీసం ప్రాణం కోసం ఆరాటపడే మనిషి భావోద్వేగాలను సరిగా చూపించలేదు. కొన్ని సన్నివేశాల్లో అయితే అసలు ఏం చెబుదామనుకొన్నాడో దర్శకుడికి తప్ప మరెవరికీ అర్ధం స్థాయిలో స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ ఉన్నాయి.

విశ్లేషణ : సినిమాలో కామెడీ కంపల్సరీ అని ఏ ప్రేక్షకుడు అనుకోడు, ఇటీవల విడుదలైన తమిళ అనువాద చిత్రం “D 16″లో ఏం కామెడీ ఉందని ఆడియన్స్ ఆదరించారు చెప్పండి. సో సినిమాలో ఎమోషన్ ఉండాలి, ఆ ఎమోషన్ ను ఎలివేట్ చేసే పెర్ఫార్మెన్స్ లు కూడా ఉండాలి. ఎమోషన్ అంటే ఒళ్ళంతా ఊపుతూ ఆర్టిస్టులు అరవడం కాదు. ఆ విషయాన్ని అర్ధం చేసుకొన్నప్పుడు “ఒక్కడు మిగిలాడు” లాంటి సినిమాల ఔట్ పుట్ విషయంలో కాస్త మార్పు వస్తుంది. లేదంటే.. ఎప్పట్లానే థియేటర్లో రెండు రోజులు హడావుడి చేసి వెళ్లిపోతాయి.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus