రొటీన్ కథను కొత్తగా చెప్పడం ఒక ఆర్ట్. మరీ రొటీన్‌గా చెప్పి ప్రేక్షకులను విసిగించడం వరస్ట్. ‘ఒరేయ్ బుజ్జిగా’ ట్రయిలర్, పాటలు చూసినప్పుడు కన్‌ఫ్యూజన్ కామెడీతో తీసినట్టు అర్థమవుతూ ఉంటుంది. స్క్రీన్ మీద కన్‌ఫ్యూజన్ కామెడీ నవ్వులు పూయించిందా? గత నాలుగు, ఐదు సినిమాలతో సరైన హిట్టు కొట్టలేకపోతున్న రాజ్ తరుణ్ ఈ సినిమాతో హిట్ కొట్టాడా? ఆల్మోస్ట్ ఐదేళ్ళ గ్యాప్ తరవాత డైరెక్షన్ చేసిన విజయ్ కుమార్ కొండా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పడ్డారా?
కథ: బుజ్జి అలియాస్ శ్రీను, శ్రీనివాస్ (రాజ్ తరుణ్)ది నిడదవోలు. కృష్ణవేణి (మాళవికా నాయర్)దీ అదే ఊరు. ఒకరికి మరొకరితో పరిచయం లేదు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని బుజ్జి, బావతో పెళ్లి ఇష్టం లేని కృష్ణవేణి ఒకరి వెనుక మరొకరు ఒకే ట్రయిన్ ఎక్కుతారు. అది చూసిన ఎవరో ఇద్దరూ కలిసి లేచిపోయారని పుకారు పుట్టిస్తారు. ట్రయిన్‌లో కృష్ణవేణికి తన పేరు శ్రీను అని బుజ్జిగాడు పరిచయం చేసుకుంటాడు. తన పేరు స్వాతి అని కృష్ణవేణి చెప్తుంది. బుజ్జిగాడు అసలు పేరు శ్రీను అని కృష్ణవేణికి తెలియదు. కృష్ణవేణి ఎలా ఉంటుందో బుజ్జి అలియాస్ శ్రీనుకి తెలియదు. వాళ్ళిద్దరికీ ఒకరి గురించి మరొకరికి ఎప్పుడు తెలిసింది? ఈలోపు ఊళ్లో ఏం జరిగింది? చివరికి ఏమైంది? అనేది సినిమా.
నటీనటుల పనితీరు: రాజ్ తరుణ్, మాళవికా నాయర్ ఇద్దరూ సహజంగా నటించారు. వాళ్ళిద్దరి నటన, డైలాగ్ డెలివరీ వల్ల కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. యాక్టింగ్ పరంగా ఛాలెంజ్ విసిరే సన్నివేశాలు పెద్దగా లేకపోవడంతో సులభంగా నటించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరింది. కానీ, పరమ రొటీన్ సన్నివేశాల్లో ఇద్దరూ ఏం చెయ్యలేక చేతులు ఎత్తేయాల్సి వచ్చింది. పోసాని కృష్ణమురళి, వీకే నరేష్ వంటి సీనియర్ యాక్టర్లు కూడా తమ శక్తి మేరకు సన్నివేశాలను నిలబెట్టడానికి ప్రయత్నించారు. కానీ, రొటీన్ సన్నివేశాలు వాళ్ళకు కొన్నిసార్లు ఆ చాన్సు ఇవ్వలేదు. సప్తగిరి, మధునందన్, సత్యం రాజేష్, స్వామి రారా సత్య తదితరులు పాత్రలకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళారు. వాణీ విశ్వనాథ్, హెబ్బా పటేల్ పాత్రలు కూడా గొప్పగా లేవు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. కొత్తదనం లేకపోతే పోయింది. గతంలో తీసిన సినిమాలను తిప్పి తీసినట్టు ప్రేక్షకులకు అనిపిస్తే అసలుకే మోసం వస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. రొటీన్ స్టోరీ సినిమాకి మెయిన్ మైనస్ అయితే, అంతకన్నా రొటీన్ కామెడీ సన్నివేశాలతో తియ్యడం వలన ప్రేక్షకులకు విసుగు వస్తుంది.
‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా విజయ్ కుమార్ కొండాకి విజయాన్ని అందిస్తే, తరవాత తీసిన ‘ఒక లైలా కోసం’ మోస్తరు విజయాన్ని అందించింది. ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా చూస్తున్నంతసేపూ ఆ రెండు సినిమాలు గుర్తుకు వస్తాయి. డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటంటే… హీరోకి హీరోయిన్ ఐడెంటిటీనో, హీరోయిన్‌కి హీరో ఐడెంటిటీనో తెలియకపోవడం. అంతకు మించి ‘ఒరేయ్ బుజ్జిగా’ గురించి చెప్తే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. యాక్చువల్లీ… సినిమాలో ట్విస్ట్ ఊహించడం ప్రేక్షకులకు పెద్ద కష్టం ఏమీ కాదు. సినిమా కథే ఐదేళ్ల క్రితం సినిమాలను తలపిస్తే సన్నివేశాలు అంతకు ముందు వచ్చిన సినిమాలను తలపిస్తాయి. డైలాగులు నవ్వించకపోగా చాలా సన్నివేశాల్లో వినిగిస్తాయి. ఎమోషన్స్ కూడా ఎక్కడా పండలేదు. పాటలు కొంతవరకు పర్వాలేదు. ఎడిటింగ్ మాత్రం బాలేదు. ఈజీగా అరగంట సినిమాను కత్తిరించవచ్చు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఓకే.
విశ్లేషణ: లాజిక్కులు, కథా కమామీషు వంటివి పక్కన పెట్టేసినా సరే… టీవీల్లోని కామెడీ షోల్లో ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలో కంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. కామెడీ కొన్ని సన్నివేశాల్లో వర్కవుట్ అయినప్పటికీ దాని కోసం రెండున్నర గంటలు టైమ్ స్పెండ్ చెయ్యాలంటే ఒకటికి రెండున్నరసార్లు ఆలోచించుకోవాలి.
రేటింగ్: 2/5
ప్లాట్ ఫామ్ : ఆహా