తెలుగు సినిమాల గురించి పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) తరచుగా తన అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. అలా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు, విశ్లేషణలు చెప్పుకొచ్చారు. బాలకృష్ణ – బాబీ (Bobby) కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి వచ్చి ఆశించిన విజయం అందుకుంది. ‘డాకు మహారాజ్’ కథాంశం కొత్తది కాకపోయినా, టేకింగ్, సంభాషణలతో కొత్తగా చూపించారు అని పరుచూరి మెచ్చుకున్నారు. ఇంకా ఆయన సినిమా గురించి ఏం చెప్పారంటే?
బాలకృష్ణను సినిమాలో కొత్తగా చూపించడానికి ‘కొండవీటి దొంగ’ సినిమాలోని గెటప్ వేశారు. చదువుకున్న వాళ్లు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామనే బాధ కలిగినప్పుడు కొందరు ఇలాంటి అవతారాలు ఎత్తుతారు. ఇందులో బాలయ్య ‘డాకు మహారాజ్’ అవతారం ఎత్తారు. ఆ పాత్రలో హీరో ఏం చేశాడన్నదే సినిమా కథ. నిప్పుల్లో నుండి బాలకృష్ణ రావడం, తాను ‘లార్డ్ ఆఫ్ డెత్’ అని.. ‘ప్రాణాలు ఇచ్చే దేవుడిని కాదు.. తప్పు చేసిన వారి ప్రాణాలు తీసే దేవుడిని’ అని ఆయనతో డైలాగులు చెప్పించారు. ఇదంతా శ్రీకృష్ణుడి నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నదే అని అన్నారు పరుచూరి
సినిమాలో బాలకృష్ణను భగవంతుడిగా చూస్తారు. నిప్పుల్లో నుండి హీరో రావడం అంటే ఆయన అగ్ని పునీతుడని అర్థం అని అర్థం వచ్చేలా ఆ సీన్ రాసుకున్నారు. దర్శకుడు బాబీ కొత్త కథాంశాన్ని రాసుకోలేదు. కానీ మొదటి నుండి చివరి వరకు కథను చక్కగా నడిపించారు. ఇక చైల్డ్ సెంటిమెంట్‌ను అద్భుతంగా రాసుకున్నారు అని పరుచూరి సినిమా గురించి చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమా గురించి చూస్తే.. సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ద్వారా బాలయ్య ఇప్పుడు ఇతర భాషల వారికి దగ్గరయ్యాడు అని టాక్. ఆయన స్టైల్, మాస్ ఇమేజ్ వారికి బాగా నచ్చుతోంది అని చెబుతున్నారు.