విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ‘మహారాజ’ గురించి కొన్ని రోజుల క్రితం వరకు చాలా మాట్లాడుకున్నాం. విజయ్ నటన, సినిమా కాన్సెప్ట్ – స్క్రీన్‌ప్లే ఇలా చాలా విషయంలో చాలా విషయాలు చర్చకు వచ్చాయి. తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) ఈ సినిమాకు తన రివ్యూ ఇచ్చారు. ‘మహారాజ’ సినిమా ఓ మంచి ఫీల్‌గుడ్ మూవీ అని, తన మనసుకి మరో ‘సర్పయాగం’ సినిమాలా అనిపించింది అని చెప్పారు. ‘మహారాజ’.. ‘సర్పయాగం’.. రెండూ సినిమాలు ఒక్కటే అని చెప్పలేను కానీ, స్క్రీన్‌ప్లే, పాత్రలకు దగ్గర పోలికలున్నాయి.
సస్పెన్స్, సెంటిమెంట్ ఒక ఒరలో ఇమడవు అంటుంటారు. కానీ ఈ సినిమాలో మధ్యమధ్యలో సెంటిమెంట్‌ని తీసుకొచ్చి మెప్పించారు కూడా. భార్య, కుమార్తె చావులకు కారణమైన వారిని చంపడం అనే అంశంలో కథ, కథన చాతుర్యం తెలివిగా చూపించారు. ఈ కథను నమ్మి సినిమాగా తీసిన నిర్మాత, దర్శకుల ధైర్యాన్ని మెచ్చుకోవాలి. చట్టాల్లో ఉన్న లోపాల్ని సవరించడానికి, ఆ చట్టం పరిధిని దాటి ప్రవర్తించిన సగటు వ్యక్తి కథ ఇది.
విలన్ భార్య పాత్రను బాగా డిజైన్ చేశారు. అయితే జరిగిన అన్యాయం తన కూతురికి కాదు ప్రతినాయకుడి కూతురికి అన్న ట్విస్ట్ అదిరిపోయింది. కూతురు కానీ కూతురు కోసం హీరో ఇంత చేశాడా అనే పాయింట్ సినిమాకు కొత్తదనం తీసుకొచ్చింది. విజయ్ సేతుపతి కోసమే ఈ సినిమా చూడాలి. ఇంత క్లిష్టమైన విషయాన్ని సినిమా మొత్తం తన భుజాలపై మోసి అద్భుతమైన నటుడిగా మరోసారి నిరూపించుకున్నారు.
ఇక భారతీరాజా తెరమీద చూడగానే నమస్కారం పెట్టుకున్నాను. గతంలో ఆయనతో సినిమా ప్లాన్ చేసి చేయలేకపోయాం. ఆ రోజుల్లో ఎవరైనా సరే ఆయన ఇంటికెళ్లి కథ చెప్పాలి. కానీ ఆయనే మా దగ్గరకు వచ్చి కథ విని చేద్దాం అన్నారు. కానీ ఆ సినిమా చేయలేకపోయాం. అందుకేనేమో సినిమాలో భారతీరాజాను చూడగానే హృదయం బరువెక్కింది అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.