టాలీవుడ్‌లో ఏదైనా సినిమా టికెట్ ధరలు పెంచినప్పుడు.. రెండు రకాల స్పందనలు వస్తాయి. ‘ఇలా రేట్లు పెంచేస్తే ఎలా?’ అనేది తొలి స్పందన అయితే.. ‘మీకు కావాలనుకుంటే చూడండి.. బలవంతం ఏమీ లేదు’ అనేది రెండో స్పందన. తొలి స్పందన ప్రేక్షకుల నుండి వస్తే.. రెండో స్పందన నిర్మాతలు, దర్శకులు, రిలీజ్ నిర్మాతలు, హీరోల నుండి వస్తుంది. ఈ స్పందన కాస్త అటు ఇటుగా ఉన్నా అర్థం అదే. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈసారి స్పందన హీరో పవన్ కల్యాణ్ నుండే వచ్చింది.
ఉగాది కానుకగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను తీసుకొస్తున్నారు పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్. ఈ నేపథ్యంలో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఇటీవల నిర్వహించారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సినిమా టికెట్ ధరల పెంపు విషయాన్ని ప్రస్తావించారు. దాన్ని సమర్థించుకుంటూ రెండు లాజిక్‌లు కూడా చెప్పారు. అవి వినడానికి బాగున్నా.. ఏ మాత్రం సరికాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ మాటలు కూడా ఇతర సినిమా జనాల మాదిరిగానే ఉన్నాయి కాబట్టి.
సినిమా టికెట్ రేట్ పెంచుకునేటప్పుడు ఇతర సినిమా పెద్దలు అన్నట్లే.. సినిమా చూడటం చూడకపోవడం మీ ఇష్టం. ధర ఎక్కువున్నప్పుడు చూస్తారా? లేక ధర తగ్గాక చూస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది అని పవన్ అన్నారు. ఆయన చెప్పింది కరెక్టే. అయితే నార్మల్ ధర వచ్చేసరికి థియేటర్ల నుండి సినిమాలు ఎత్తేస్తున్నారు. ఇక్కడే పవన్ ఇంకో మాట కూడా అన్నారు. పెంచిన రేటు వల్ల బ్లాక్‌లో టికెట్‌లు కొనక్కర్లేదు అని. బ్లాక్‌లో టికెట్ల అమ్మకాలు జరగకుండా చూడాల్సింది పోయి ధర పెంచితే బ్లాక్ మార్కెట్ ఉండదు అంటే ఎలా?
అందుబాటులో వినోదం ఉండాలని అందరూ అనుకుంటారు. అందుకే థియేటర్లకు రావడానికి చాలామంది వెనకడుగు వేసి.. ఓటీటీలవైపు వెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా సినిమా పెద్దల ఆలోచనలు ‘నచ్చితే.. డబ్బులు అంతేసి పెట్టి చూడండి’ అనే దగ్గరే ఆగిపోయింది. ఇది ఎంతవరకు పరిశ్రమకు మంచిదో వారికే తెలియాలి.