ఓ మంచి పని కోసం నిర్వహిస్తున్న కాన్సర్ట్‌కు వచ్చినప్పుడు టికెట్ కొనాలని చూస్తే వద్దన్నారు అని ఏకంగా రూ.50 లక్షలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan). తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన ‘యూఫోరియా మ్యూజికల్ నైట్’ ఈవెంట్ సందర్భంగా ఇది జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman) ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. కార్యక్రమం ముందు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..
సహాయ కార్యక్రమంలో వినోదం చూడొచ్చని ఈ మ్యూజికల్ నైట్ ద్వారా నిరూపించారు. ఈ ఈవెంట్‌తో విజయవాడకు వన్నె తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి సంగీతం అందిస్తున్న తమన్‌కి అభినందనలు అని చెప్పారు. తలసీమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు రూ.50లక్షలు విరాళం అందిస్తున్నా అని పవన్ తన సాయం గురించి ప్రకటించారు. నిజానికి ఈ ఈవెంట్‌కు టికెట్ కొనమని మా టీమ్‌కి చెబితే, విషయం తెలిసి, భువనేశ్వరి ‘మీరు టికెట్ కొనక్కర్లేదు.
కార్యక్రమానికి రండి’ అని అన్నారు. అయితే ఇప్పుడు మీరంతా టికెట్ కొని వస్తే.. నేను ఫ్రీగా రావడం తప్పుగా అనిపిస్తోంది. అందుకే తలసేమియా బాధితుల చికిత్స కోసం నా వంతుగా త్వరలోనే ఎన్టీఆర్ ట్రస్ట్‌కు రూ.50లక్షలు విరాళం ఇస్తా అని పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో రూ.1500 టికెట్ కొననివ్వకపోతే రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చేయాలా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దానికి ఆయన ఫ్యాన్స్ ‘ఆయనంతే సర్.. అలా ఇచ్చేస్తుంటారు’ అని రిప్లైలు ఇస్తున్నారు.
నిజానికి గతంలో కూడా పవన్ ఇలాంటి దానాలు చేసి ఉన్నారు. కాబట్టి ఇదేం కొత్త కాదు. మంచి పని కోసం ఆయన ఇలా డబ్బులు ఇవ్వడం మనకు తెలిసిన విషయమే. మరోవైపు ప్రభుత్వంలో రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతుందన్న వార్తలకు కూడా ఈ ఈవెంట్ ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.