ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా ఈరోజు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె, కుటుంబ సమేతంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం అర్చకులు పవిత్ర తీర్థప్రసాదాలను అందించారు. అన్తఈ కాకుండా ఆమె తలనీలాలు కూడా సమర్పించిన విధానం వైరల్ అవుతోంది. ఇటీవల పవన్-అన్నా దంపతుల కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో చదువుకుంటున్న పాఠశాల వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో స్వల్ప గాయాలపాలయ్యాడు.
అయితే సకాలంలో చికిత్స అందించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన తర్వాత కుటుంబం తమ కుమారుడు త్వరగా కోలుకున్నందుకు శ్రీవారికి కృతజ్ఞతగా తిరుమల దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కుటుంబం తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఈరోజు మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షల విరాళాన్ని ఇచ్చారు.
ఈ విరాళంతో బహుళ సంఖ్యలో భక్తులకు భోజనం ఏర్పాటు చేశారు. శుభతేది 14 ఏప్రిల్ 2025 న మార్క్ శంకర్ పేరు మీద ఈ కార్యక్రమం జరిగింది. అన్నదాన బోర్డుపై “ఈరోజు భోజన దాత: కొణిదల మార్క్ శంకర్ – విరాళం మొత్తం: ₹17,00,000” అనే ప్రకటనతో విరాళం వివరాలు ప్రదర్శించబడ్డాయి. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వేగంగా పాకింది. పవన్ అభిమానులు, భక్తులు కూడా ఈ మొక్కుల చెల్లింపుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా శ్రీవారి ఆశీస్సులతో మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడిన నేపథ్యంలో పవన్ కుటుంబం వినయపూర్వకంగా మొక్కు చెల్లించుకున్న తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. భక్తిలో చూపిన ఈ మనోభావానికి మెగా ఫ్యామిలీ అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.