ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్‌కు (Salman Khan) బెదిరింపులు ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఇలా కాల్స్ / మెయిల్స్ రావడంతో భద్రతను పెంచిన అధికారులు ఇంకా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మరోమారు బెదిరింపులు రావడంతో మరోసారి అప్రమత్తమయ్యారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి ఏకంగా కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం అని అగంతుకులు బెదిరింపులకు పాల్పడ్డారు. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి గత కొంతకాలంగా హెచ్చరికలు చేస్తోన్న విషయం తెలిసిందే.
తాజాగా సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ వర్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. సల్మాన్ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతామని, లేదంటే కారులో బాంబు పెట్టి పేల్చేస్తామని ఆ వాట్సాప్ మెసేజ్‌లో రాసుకొచ్చారు. ఈ మెసేజ్ గురించి తెలుసుకున్న ముంబయి పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు ఆ మెసేజ్ పంపిన వ్యక్తిని కనిపెట్టే పనిలో ఉన్నారు. త్వరలోనే ఆ వ్యక్తిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇక పైన చెప్పినట్లు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. బాంద్రాలో సల్మాన్ నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద గతేడాది ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అంతకుముందు పాన్వేల్ ఫామ్ హౌస్‌లోకి చొరబడటానికి కొంతమంది ప్రయత్నించడం కూడా జరిగింది. ఆ రెండు ఘటనలు మరచిపోక ముందే తాజా బెదిరింపు వచ్చింది.
సల్మాన్‌కు బెదిరింపులు ఎక్కువైన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు వై ప్లస్ భద్రతను నియమించింది. ఈ క్రమంలోనే ఆయన భారీ భద్రత నడుమ షూటింగ్స్, పబ్లిక్ ఈవెంట్స్‌కి వస్తున్నారు. ‘బిగ్ బాస్’ షోను కూడా అంతే జాగ్రత్తలతో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.