పవన్ కల్యాణ్ లైనప్ ఉన్న తికమకగా టాలీవుడ్లో మరే హీరో లైనప్ లేదు అని చెప్పాలి. ఓ సినిమా సెట్స్ మీద ఉంది, మరో సినిమాకు కొబ్బరి కాయ కొట్టినా మొదలవ్వడం లేదు, ఇంకో సినిమా రేపు, మాపు అంటున్నారు కానీ ఎప్పుడు మొదలో తెలియడం లేదు. ఇంకా అనౌన్స్ చేసి పక్కన పెట్టేసిన సినిమాలు ఉన్నాయి. పోనీలే సెట్స్ మీద ఉన్న సినిమా అయినా విడుదలవుతుంది కదా అనుకుంటే.. పవన్ చేసిన ఓ పని ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది.
రాజకీయ పార్టీ పర్యటనలు, కార్యక్రమాల కోసం పవన్ ఇటీవల బయటికొస్తున్నారు. ఈ క్రమంలో అతని క్రాఫ్‌లో మార్పును గమనించారు ఫ్యాన్స్. సెట్స్ మీద ఉన్న ‘హరి హర వీరమల్లు’ కోసం పవన్ గత కొన్ని రోజులుగా పొడవాటి జుట్టుతో కనిపిస్తున్నాడు. మీస కట్టులో మార్పు చూపించాడు. అయితే రీసెంట్గా చూస్తే మాత్రం నార్మల్ లుక్‌లోకి వచ్చాడు. ‘వీరమల్లు’ లుక్‌లో లేడు. దీంతో ఆ సినిమా ఆగిపోయిందా, వాయిదా పడిందా అనే ప్రశ్న మొదలైంది.
సుమారు రెండేళ్లుగా ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ జరుగుతోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినిమా తొలుత ఆలస్యమైనా.. ఆ తర్వాత సినిమా వస్తున్న విధానం పట్ల పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలొచ్చాయి. సినిమాను ఎలా పడితే అలా చుట్టేస్తున్నట్లు పవన్‌కి అనిపించి, సినిమా స్క్రీన్‌ప్లే మీద మళ్లీ కూర్చోవాల్సిన అవసరం ఉందని క్రిష్‌కి సూచించారని వార్తలొచ్చాయి. దీంతో సినిమా షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి అని అంటారు. అయితే ఇప్పుడు లుక్ మార్చేయడంతో ‘వీరమల్లు’ ఉన్నట్లా, లేనట్లా అనే ప్రశ్న మొదలైంది.
పవన్ లుక్ మారడం వెనుక మరో కారణం కూడా ఉంది అని అంటున్నారు. తమిళంలో విజయవంతమైన ‘వినోదాయ చిత్తాం’ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు. మాతృకను రూపొందించిన సముద్రఖనినే ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాను త్వరలో ప్రారంభిస్తారని సమాచారం. దీని కోసమే పవన్ లుక్ మార్చారు అని చెబుతున్నారు. నిజానికి ‘భవదీయుడు భగత్ సింగ్’ ప్రారంభం కావాల్సి ఉన్నా ‘వినోదాయ చిత్తం’ వైపే పవన్ మొగ్గుచూపారట. తక్కువ రోజుల్లోనే తన పాత్ర పూర్తయ్యే అవకాశం ఉన్నందున ‘వినోదాయ చిత్తం’ సెట్స్‌లో త్వరలో పవన్ అడుగుపెడతారని సమాచారం. ఇందులో సాయి తేజ్ మరో ప్రధాన పాత్రధారి.