The Warriorr Review: ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

అప్పుడెప్పుడో వచ్చిన “పందెం కోడి, ఆవారా” తర్వాత లింగుస్వామికి సరైన హిట్ పడి దశాబ్ధం దాటింది. మధ్యలో అల్లు అర్జున్ తో సినిమా మొదలెట్టి.. అది షూటింగ్ స్టేజ్ కు వెళ్లకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఒక ప్రొజెక్ట్ సెట్ చేసుకోవడానికి ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి తరుణంలో రామ్ పిలిచి మరీ ఇచ్చిన అవకాశం “ది వారియర్”. ఈ మాస్ మసాలా సినిమాతో లింగుస్వామి మళ్ళీ తన సత్తాను చాటుకోగలిగాడా లేదా అనేది చూద్దాం..!!

కథ: సత్య (రామ్) ఓ బాధ్యతగల డాక్టర్.. కర్నూల్ సిటీలో డాక్టర్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. అయితే.. లోకల్ గూండా గురు (ఆది పినిశెట్టి) చేస్తున్న అన్యాయాలను చూస్తూ భరించలేక ఎదురుతిరగడానికి ప్రయత్నిస్తాడు. అయితే.. డాక్టర్ సత్యగా గురును ఏమీ చేయలేను అని గ్రహించి.. డాక్టర్ వృత్తికి స్వస్తి పలికి పోలీస్ అవుతాడు.

పవర్ ఉన్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్య & మొండిఘటమైన గురు మధ్య జరిగిన ప్రచ్చన్న యుద్ధమే “ది వారియర్” కథ.

నటీనటుల పనితీరు: రామ్ కి ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే.. తను నమ్మిన కథ, పాత్రకు ప్రాణం పెట్టేస్తాడు. నిజానికి ఈ సినిమా కథ-కథనం చాలా సోసోగా ఉన్నాయి. కానీ.. రామ్ ఆ రెండు రొటీన్ వేరియేషన్స్ ను తన స్టైల్లో యూనీక్ గా ప్రెజంట్ చేసిన విధానం బాగుంది. రామ్ ఎనర్జీ, డ్యాన్స్ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఫైట్స్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటాయి.

రామ్ తో సమానంగా, కొన్ని సన్నివేశాల్లో రామ్ ను డామినేట్ చేసే స్థాయిలో గురు పాత్రలో జీవించేశాడు ఆది పినిశెట్టి. పాత్ర చాలా రొటీన్ & రెగ్యులర్ అయినప్పటికీ.. తన మ్యానరిజంతో అలరించాడు ఆది.

కృతి శెట్టి కేవలం పాటలకు, కొన్ని అనవసరమైన సన్నివేశాలకు పరిమితమైపోయింది. క్యూట్ గా కనిపించింది కానీ.. నటిగా మాత్రం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. చాలా సన్నివేశాల్లో బ్లాంక్ ఫేస్ పెట్టేసింది.

అక్షర గౌడ, నదియా తదితరులు పర్వాలేదనిపించుకున్నారు. తమిళ కమెడియన్ రెడిన్ కింగ్ స్లే కామెడీ మన తెలుగు నేటివిటీకి సింక్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: దేవిశ్రీప్రసాద్ పాటల వరకూ పర్వాలేదు కానీ.. నేపధ్య సంగీతంతో మాత్రం దారుణంగా నిరాశపరిచాడు. అసలు.. భీభత్సమైన మాస్ ఎలివేషన్ ఉన్న సీన్స్ కి కూడా ఏవో డప్పులు కొట్టేసి.. తన స్థాయిని తానే దించుకున్నాడు. అసలు ఈ తరహా సినిమాలకు కావాల్సింది మంచి కిక్ ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్. అదే మిస్ అవ్వడం సినిమాకి మెయిన్ మైనస్ అయ్యింది.

సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ సబ్జెక్ట్ తగ్గట్లు ఉంది. ప్రొడక్షన్ డిజైన్ మాత్రం మంచి భారీగా ఉంది. ఆర్ట్ & వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విషయంలో అస్సలు రాజీపడలేదు నిర్మాతలు.

దర్శకుడు లింగుస్వామి.. తనకు బాగా అచ్చొచ్చిన పవర్ ఫుల్ హీరో & విలన్ క్లాష్ నే ఈ సినిమా కోసం కూడా తీసుకున్నాడు.

ప్రెజంటేషన్ స్టైలిష్ గా ఉంది కానీ.. హీరో-విలన్ మధ్య ఫైట్ కి రీజన్ మాత్రం చాలా పేలవంగా ఉంది. కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది చాలా ముఖ్యమనే విషయం లింగుస్వామికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ.. ఆయన మేకింగ్ మీద పెట్టిన శ్రద్ధలో సగం కూడా కథనం మీద పెట్టకపోవడంతో.. మంచి మాస్ బ్లాక్ బస్టర్ గా నిలవాల్సిన సినిమా యావరేజ్ గా మిగిలిపోయింది. ఇకనైనా లింగుస్వామి కథనంపై శ్రద్ధ పెడితేనే ఆయన ఫ్యూచర్ ప్రొజెక్ట్స్ రావడం, వర్కవుటవ్వడం అనేది జరుగుతుంది.

విశ్లేషణ: కథ-కథనంతో సంబంధం లేకుండా.. కేవలం మాస్ ఫైట్స్ చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్ ను ఆకట్టుకునే చిత్రం “ది వారియర్”. రామ్ ఎనర్జీ, ఆది పినిశెట్టి మ్యానరిజమ్స్ మాత్రమే ఈ సినిమాని కాపాడాయి. సో రామ్ ‘వారియర్’ తో బ్లాక్ బస్టర్ కాకపోయినా.. యావరేజ్ తో గాడినపడ్డాడు.

రేటింగ్: 2.5/5

Click Here To Read In ENGLISH

Share.