ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఎంతో మంది పోరాడుతున్నారు. రీసెంట్ గా లోక్ సభను కుదిపేసిన ఈ అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ టాపిక్ కి, ఈ రోజుకి ఒక ముఖ్యమైన అనుబంధం ఉంది. గత ఏడాది ఆగస్టు 9 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ తిరుపతి మంచాలవీధికి చెందిన బెంగళూరు ముని కామకోటి ఆత్మాహుతి చేసుకున్నారు. ఈ ఘటన జరిగి సంవత్సరం అవుతున్నా ఆ కుటుంబాన్ని ఆదుకునే వారే కరువయ్యారు.
ఈ విషయం తెలిసిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మునికోటి కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేయాలని భావించారు. తన పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య ను మునికోటి ఇంటికి పంపించారు. ప్రత్యేక హోదా కోసం బలిదానం చేసిన వ్యక్తి కుటుంబానికి పార్టీ తరుపున 5 లక్షలను అందజేయాలని పవన్ రాఘవయ్యకు సూచించారు. ఆయన ఈరోజు సాయంత్రం లోపున వారికి సాయాన్ని అందించనున్నారు.
వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో ఉన్నా పవన్ కళ్యాణ్ సాయం చేసే గుణాన్ని మానుకోలేదు. పార్టీ తరుపున సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నారు. పవర్ స్టార్ సమాజంలోని అంశాలపై స్పందిస్తున్న తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు స్పష్టంగా తెలుస్తుందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.