కళ అనేది సంస్కృతి లో అంతర్భాగం.. మన భాష ని, యాసని మర్చిపోకూడదు – పవన్ కళ్యాణ్

  • July 10, 2016 / 06:04 AM IST

యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ (UKTA) 6 వ వార్షికొత్సవ వేడుకలు, జయతే కూచిపూడి , జయతే బతుకమ్మ సాంస్కృతిక వేడుకలు లండన్ త్రాక్సి లో ఘనం గా నిర్వహించారు. సుమారు 1500 మంది పాల్గొన్న ఈ వేడుకలకు ప్రముఖ సినీ నటులు శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు.

ఈ కార్యక్రమాన్ని శ్రీ సూర్యనారాయణ శాస్త్రి గారు UKTA గురించి వివరిస్తూ రచించిన పద్యగానం తో ఆరంభించారు. అనంతరం నాట్యారామం బృందం ప్రదర్శించిన దశావతారం, మహిషాసురమర్ధిని , యక్ష గానం (భామా కలాపం, గాయత్రీ వనమాలీ, భక్త ప్రహ్లాద) ఆద్యంతం రసవత్తరం గా సాగుతూ వీక్షకుల మదిని దోచుకున్నాయి.

అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమం లో, ముఖ్య అతిధి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళాకారులకు జ్ఞాపికలను అందజేశారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, సాంస్కృతిక ఉత్సవాలు , వాటి ప్రయోజనాల గురించి మాట్లాడుతూ కళ మనకు నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తూ, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేది గా ఉండాలి అని చెప్పారు. కళ అనేది సంస్కృతి లో అంతర్భాగమని, మన భాష ని, యాసని మర్చిపోకూడదని ఈ సందర్భం గా పేర్కొన్నారు. తన సినిమాల ద్వారా సంప్రదాయాల్ని ప్రోత్సహిస్తానని, వివిధ తెలుగు ప్రాంతాల జానపద గీతాలు తన సినిమాల్లో ఉండేలా చూస్తానని జానపదం గురించి ప్రస్తావించి చెప్పారు. తెలుగు సంప్రదాయాల్ని భావి తరాలకు పంచేందుకు ఈ తరహా ఉత్సవాలు ఎంతో సాయం చేస్తాయని అభిప్రాయ పడ్డారు. UKTA తలపెట్టిన ఈ మహాద్యమం లో పాల్గొన్న కళాకారుల్ని, విజయవంతం గా నిర్వహించిన కార్యవర్గ సభ్యులని, కళల పట్ల ఆసక్తి తో విచ్చేసిన ప్రేక్షకులను అభినందించారు. తెలుగు సంస్కృతి మరియు కళలను భావి తరాల వారికి అందించటం లో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని, దీనికి ప్రవాస ఆంధ్రులు చేస్తున్న కృషి ని కొనియాడారు.

శ్రీ వడ్డేపల్లి శ్రీనివాస్ బృందం ఆధ్వర్యం లో జరిగిన తెలంగాణా జానపద నృత్య ప్రదర్సన, ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా శ్రీ వడ్డేపల్లి మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణా లో 200 పైచిలుకు జానపద నృత్య, గేయ మరియు నాటక కళారూపాలు ఉన్నాయని, వీటి ముఖ్య ఉద్దేశ్యం మానసికోల్లాసం అని పేర్కొన్నారు.

ప్రసాద్ మంత్రాల, UKTA వ్యాపార కార్యదర్శి, పాల్గొన్న కళాకారులకి, సమర్పకులకు కృతఙ్ఞతలు తెలిపి, ఈ కార్యక్రమం ఘన విజయం వెనుక ఉన్న UKTA కార్య వర్గం కృషి, పట్టుదల, మొండితనం కారణమని, నరేంద్ర మున్నలూరి, కృష్ణ యలమంచిలి, ఉదయ్ అరేటి, అమర్ రెడ్డి, బలరాం విష్ణు, రాజ్ కూర్బ, ఆదిత్య అల్లాడి, పూర్ణిమ రెడ్డి, పద్మ కిల్లి, గీత మోర్ల, భాను ప్రకాష్ లను పేరు పేరునా అభినందించారు. UKTA చైర్మన్ శ్రీ కిల్లి సత్య ప్రసాద్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ, వయసు భేదం లేకుండా తెలుగు వారికోసం చేస్తున్న కృషి గురించి వివరించి, భవిష్యత్తు లో ఇంకా ఎన్నో శిఖారాలను అధిరోహిస్తామని ఆశాభావం వ్యక్త పరుస్తూ వందన సమర్పణ తొ ఈ కార్యక్రమం ముగిసింది

“జయతే కూచిపూడి, జయతే బతుకమ్మ “

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus