‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా వచ్చేసింది.. ఫలితం సంగతి కూడా తేలిపోయింది. దీంతో పవన్ కొత్త సినిమా ఏంటి? అనే చర్చ మొదలైంది. ఓ సినిమా ఇప్పటికే ఓకే అయినా.. కథ విషయంలో ఇంకా లెక్క కొలిక్కి రాకపోవడంతో ఆలస్యమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ మరో దర్శకుడితో సొంత బ్యానర్‌లో ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ఇటీవల రీయాక్టివేట్ చేసిన పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీదనే ఈ సినిమా ఉంటుందని కూడా చెప్పారు. ఈ క్రమంలో ఆ బ్యానర్ క్లారిటీ పోస్ట్ పెట్టింది.
దాని వల్ల క్లారిటీ రాలేదు కానీ.. ఇప్పట్లో సినిమా సంగతి బయటకు వచ్చే అవకాశం లేదు అనే మేటర్ మాత్రం బయటకు వచ్చింది. అలాగే రూమర్లకు తగ్గట్టుగా పవన్ కొత్త సినిమా సొంత బ్యానర్‌లోనే ఉంటుందనే క్లారిటీ కూడా వచ్చింది. ఇక అసలు విషయానికొస్తే.. దేవా కట్టా దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తారని, ఆ సినిమా సామాజిక అంశాల మిళితమై ఉంటుందని, ఇటు హీరో ఇమేజ్ పరంగా, అటు పొలిటికల్ కెరీర్ పరంగా కలసి వచ్చే కథ అది అంటూ రూమర్లు షికార్లు చేశాయి.
ఇలాంటి పుకార్ల విషయంలో పవన్ కానీ, ఆయన టీమ్ కానీ ఎప్పుడూ స్పందించింది లేదు. దీంతో ఇప్పుడు కూడా ఈ విషయంలో స్పష్టత రాదు అనుకున్నారంతా. కానీ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ విషయంలో క్లారిటీ లాంటిది ఇచ్చేసింది. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ఏ కొత్త సినిమానీ అంగీకరించలేదు. ఆయన తదుపరి చిత్రాలపై వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు. కొత్త సినిమాలు చేయాలన్న ప్రణాళికలు ప్రస్తుతానికి ఆయనకు లేవు అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
అంతేకాదు ఒకవేళ ఏదైనా ప్రాజెక్టు ఓకే అయితే అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలియజేస్తామని కూడా చెప్పారు. ‘ఓజీ 2’ సినిమా గురించి చెబుతూ ఈ సినిమా గురించి సరైన సమయంలో పవన్ కల్యాణే చెబుతారు అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇదంతా చెప్పారు కానీ దేవా కట్టా సినిమా ఉంటుందా? లేదా? అనేది క్లియర్‌గా చెప్పలేదు. అయితే సురేందర్ రెడ్డి సినిమా వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించుకుంటుంది అని సమాచారం.