జనాలు థియేటర్లకు రావడం తగ్గిన క్లిష్ట సమయంలో చాలా సింగిల్ స్క్రీన్స్ తాత్కాలికంగా మూతబడ్డాయి. సరిగ్గా అప్పుడే రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘పెద్ది’ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమాతో థియేటర్ వ్యవస్థ మళ్ళీ గాడిలో పడిందనేది వాస్తవం. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు సైతం మంచి విజయం సాధించాయంటే దానికి ‘పెద్ది’ ఇచ్చిన ప్రోద్బలమే ప్రధాన కారణం అని చెప్పొచ్చు.
రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ అందుకున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్ల వరకు వసూలు చేసినా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్లా బయ్యర్లకు నష్టాలనే మిగిల్చింది. ముఖ్యంగా సీడెడ్, నెల్లూరు వంటి ఏరియాలతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా నష్టాలు తప్పలేదు.
‘పెద్ది’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత వెంకట సతీష్ కిలారు.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘NBK 111’ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. దీంతో ‘పెద్ది’ మిగిల్చిన నష్టాలను బాలయ్య సినిమాతో భర్తీ చేస్తామని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, దేశీయంగా నష్టాలను సర్దుబాటు చేసినప్పటికీ.. ఓవర్సీస్‌లో ‘పెద్ది’ మిగిల్చిన నష్టాలను బాలయ్య చిత్రంతో తీర్చడం కష్టమనేది ట్రేడ్ వర్గాల మాట. ఓవర్సీస్ మార్కెట్‌లో బాలకృష్ణకు ఉన్న పరిమితుల దృష్ట్యా ఆ నష్టాల భారాన్ని ఈ సినిమా మోయడం దాదాపు అసాధ్యం. కాబట్టి, ఓవర్సీస్ నష్టాల రికవరీ కోసం నిర్మాత మళ్లీ ఫైనాన్స్ రొటేషన్ పైనే ఆధారపడక తప్పని పరిస్థితి .